కూటమి ప్రభుత్వంలోని మంత్రి నారా లోకేష్- ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా నిజాయితీగా చట్టబద్ధంగా పనిచేస్తుందో సూచించే ఒక మాట అన్నారు. నిజానికి విపక్షాలు కూడా నీరాజనం పట్టవలసిన మాట ఇది. ప్రభుత్వ ఆలోచన సరళిని అభినందించి తీరవలసిన మాట ఇది. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అమానవీయంగా వ్యవహరించిందో, ఎంతగా ప్రజాందోళనలను ఉక్కు పాదాలతో అణచివేస్తూ వచ్చిందో గమనించిన వారికి మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట వీనుల విందుగా వినిపిస్తుందటంలో సందేహం లేదు. వివరాల్లోకి వెళితే…
చంద్రబాబు నాయుడు మడకశిర నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అరెస్టులు వారికి నిత్యకృత్యం అయిపోయాయి. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు విపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఒక సాంప్రదాయంగా మారిపోయింది అనడంలో సందేహం లేదు. ఐదేళ్లుగా అలవాటు పడిన పోలీసులు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు కూడా అదే పని చేశారు. స్థానికంగా సిపిఎం నేతలను అరెస్టు చేయడం పట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. నేతలను అరెస్టు చేసినందుకు మన్నించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్లలో పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులు పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం. ఇకపై ప్రతిపక్షాలు ప్రజాసంఘాల ముందస్తు అరెస్టులు గృహనిర్బంధాలు, పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాం’ అని లోకేష్ పేర్కొన్నారు. విపక్షాలు తమ గళం వినిపించడానికి ప్రభుత్వం పాలకపక్షం స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఇవాల్టి రోజుల్లో ఒక అతి గొప్ప విషయంగా మారిపోయింది. అణచివేత ఒక్కటే పరిపాలన మార్గంగా బతికేస్తున్న పార్టీలు.. ఇంత సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.