జగన్ శాడిజం… మూల్యం అనంతం!

కేవలం చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ దక్కుతుందనే అసూయతో, ఓర్వలేనితనంతో జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలు కలలుగన్న రాజధాని అమరావతి మీద పగబట్టారు. అమరావతి రాజధానిని స్మశానంగా మార్చేశారు. ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణాన్ని వీలైనంత ముందుకు తీసుకు వెళ్ళ వలసిన బాధ్యతకు బదులుగా 70-80 శాతం పూర్తయి ఆగిన నిర్మాణాలను కూడా గాలికి వదిలేశారు. దాని ప్రభావం ఇప్పుడు నిర్మాణ పనులను తిరిగి చేపట్టడం మీద తీవ్రంగా పడుతోంది. భారీ వ్యయం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఖర్చుపెట్టినా సరే నాణ్యత అనుకున్నంత స్థాయిలో ఉంటుందా లేదా అనే భయం కూడా వెన్నాడుతోంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క అసూయ, దుగ్ధ కారణంగా రాష్ట్ర రాజధానికి ఒక శాపం తగిలినట్లు అయింది. అందుకోసం చెల్లించవలసిన మూల్యం అనంతంగా మారుతోంది!

అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసారు! మూడు రాజధానుల మాయమాటలతో రాష్ట్రమంతా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. దానిని గుర్తించిన ప్రజలు ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి ఏర్పడిన తర్వాత రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచన ప్రారంభించగనే రకరకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి. సచివాలయం, హెచ్ఓడీ టవర్లు, హైకోర్టు భవనం పునాదులు పూర్తిగా ఐదేళ్లుగా నీళ్లలోనే నానుతున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన కాంక్రీట్ పునాదులు ఎంత మేరకు సురక్షితమో, ఎంత పట్టిష్టంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఈ భవనాల పటిష్టత, నిర్ధారణకు అమరావతి ప్రాంతానికి హైదరాబాదు, మద్రాసు ఐఐటీ నిపుణులు కూడా రానున్నారు.
ఈ పునాదులలో నిలిచిపోయిన నీటిని తోడి వేసేందుకు మాత్రమే కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది అని అంచనాలు వేస్తున్నారు. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి అసూయ పుణ్యం అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఐఏఎస్ అధికారుల కోసం ఇతర ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు కూడా 70-80 శాతం పూర్తయ్యాయి. వాటి కొనసాగింపు పనులు కూడా జగన్ చేపట్టలేదు. ఇప్పుడు ఆ భవనాల పటిష్టతను కూడా ఐఐటి నిపుణులు వచ్చింది నిర్ధారించవలసిన అవసరం ఏర్పడింది. వాటిని సాధారణ స్థితికి తీసుకురావడానికి మరెన్ని కోట్లు ఖర్చవుతుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన సరళి వల్ల ఏర్పడింది అని ప్రజలంతా అనుకుంటున్నారు. పాజిటివ్ ఆలోచన లేని ఒక వ్యక్తికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితిలో పడిపోతుందో తెలుసుకోవడానికి అమరావతి రాజధాని పెద్ద ఉదాహరణ అని అందరూ అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories