ఉచిత సంక్షేమ పథకాలు అందించడం పై ప్రజలలో సాధారణంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రభుత్వం తనను తాను ప్రొవైడర్ గా భావించుకుంటూ ప్రజలకు అన్నీ ఉచితంగా అందిస్తూ పోతే వారిలోని ఉత్పాదక శక్తి సర్వనాశనం అయిపోతుందని వాదించే వారు కొందరు ఉంటారు. కానీ కొన్ని కేసులను పరిశీలించినప్పుడు కొన్ని ఉచిత పథకాలు చాలా అవసరం అని మనకు అనిపిస్తుంది. ఇలాంటి సరికొత్త పథకం ద్వారా రాష్ట్రంలోని 51 వేల మందికి పైగా ఆర్తులకు ఎంతో గొప్ప సహాయం చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సంకల్పిస్తోంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆ కారణం మీద పింఛను అందుకుంటున్న వారికి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్ లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గుండె జబ్బులు, కిడ్నీ, థలసేమియా, పక్షవాతం లెప్రసీ, లివర్ వంటి సమస్యలు ఉన్న 51,000 మందికి ప్రభుత్వం ప్రతి నెల పింఛను అందిస్తుంది. అయితే నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చే వారి అవసరాలకు వెళ్లి రావడానికి అదనంగా ఖర్చులు అవుతుంటాయి. వ్యయ ప్రయాసలు తప్పవు. ఇలాంటి నేపథ్యంలో వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటోంది. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ సేవలు వాడుకున్నప్పటికీ ఆసుపత్రికి వెళ్లడానికి ఉపయోగపడుతుంది తప్ప, తిరిగి రావడానికి మళ్లీ సొంతంగా ఖర్చలు భరించాల్సిందే. వారికి ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి ఆసుపత్రులు చుట్టూ తిరిగే ఖర్చులు తగ్గించడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నారు.
మహిళా సాధికారత, మహిళా ఉత్పాదకత పెంచే దిశగా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు సదుపాయం కల్పించడం గురించి ఆలోచన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆరు గ్యారెంటీలలో భాగంగానే ఈ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలలో ఎలా అమలవుతున్నదో పరిశీలించి త్వరలోనే ఏపీలో కూడా కార్యరూపంలోకి తీసుకురానున్నారు. మహిళలకు వారి జిల్లా పరిధిలో పూర్తి ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తారు. ఈ తరహాలో దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారికి ఉచిత బస్సు ప్రయాణం పాసులు ఇవ్వడం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అందరూ అంటున్నారు. సంక్షేమ పథకాలలో సద్వినియోగం అయ్యే దిశగా మంచి పథకాలను ప్రవేశపెట్టినట్లు అవుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు.
దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోంది. వికలాంగులకు ఏకంగా ఆరువేల రూపాయల పెన్షన్ అందజేస్తోంది. అలాగే జెనరిక్ మందులు ఉచితంగా అందించే ఆలోచన కూడా ఉంది. అలాంటిది.. ఉచిత బస్సుప్రయాణం కూడా భేషైన ఆలోచన అని పలువురు అంటున్నారు.