వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి తాను రాజును, దేవుడిని అనే భావన ఉన్నదని మనం సూత్రీకరించవలసిన అవసరం లేదు. ఆయన స్వయంగా తాను అధికారంలోకి రావడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ విషయాన్ని పదే పదే చెప్పారు. జగన్ తనను తాను రాజులాగా, దేవుడిలాగా ప్రజలకు కావలసిన సమస్తం అందించే ప్రొవైడర్ లాగా ఊహించుకుంటాడని- పీకే విశ్లేషించారు. ఆ వాస్తవానికి మరో మెట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న బొమ్మ పిచ్చి. తన బొమ్మ శిలాశాసనంగా ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలని ఆయన కోరిక.
అలాంటి కోరిక తీర్చుకోవడానికి ఆయన తన సొంత ఖర్చుతో ఏదైనా ఘనకార్యం, ఘన నిర్మాణం చేపట్టి ఉంటే అద్భుతంగా ఉండేది. అలాకాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ తాము జీవితాంతం- తమ తర్వాతి తరాల వారు కూడా చాలా భద్రంగా దాచుకునే పాసుపుస్తకాల మీద తన బొమ్మను ముద్రించి ఇచ్చారు. వారి పొలాల హద్దురాళ్ల మీద తన బొమ్మను ముద్రింపజేశారు. తరతరాలుగా మనుషులు చనిపోయినా తన బొమ్మ మాత్రం స్థిరంగా ఉండాలని జగన్ కోరుకున్నారు.
ఒకసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చినందుకు విధ్వంసక పాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనను చూసి ప్రజలు దిమ్మెరపోయి మరో 30 సంవత్సరాల పాటు తననే గెలిపిస్తూ ఉంటారని, 80 ఏళ్లు దాటి వయసు ఉడిగిపోయే వరకు తానే ముఖ్యమంత్రిగా రాజ్యమేలుతూ ఉంటానని ఊహించుకున్నారు. అయితే ఆ ఊహలన్నీ తప్పని తేలింది. ఇప్పుడు హద్దురాళ్ల మీద జగన్ బొమ్మలు చెరిపి వేయడానికి పట్టాదారు పాసుపుస్తకాల మీద జగన్ బొమ్మ లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. జగన్ కు ఉన్న బొమ్మ పిచ్చి వలన ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నానికి పడుతున్న భారం ఎంతో తెలుసా అచ్చంగా 30 కోట్ల రూపాయలు.
గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోలు ఖర్చే 700 కోట్లుగా లెక్క తేల్చారు. ఇప్పుడు ఆ బొమ్మలను చెరిపించడానికి అయ్యే ఖర్చు 15 కోట్ల రూపాయల అట. అలాగే జగన్ బొమ్మతో పాసుబుక్కులు ఇవ్వడానికి మరో 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్రభుత్వం కొత్త పాసుబుక్కులు ఇవ్వడానికి మరో 15 కోట్లు ఖర్చు కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పిచ్చి వలన ప్రభుత్వానికి పడుతున్న భారం దాదాపుగా 750 కోట్లుగా ఉంటుంది.
జగన్ ఈ మొత్తంతో అమరావతిలో కనీసం ఒక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఆయన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. కనీసం తాను స్వప్నించిన రాజధాని విశాఖపట్నంలో తన సొంత ఇంటి కోసం ప్రభుత్వ సొమ్ముతో కట్టించిన ఋషికొండ హర్మ్యాలు కాకుండా మరొక ప్రభుత్వ భవనాన్ని కట్టించి ఉంటే చాలా బాగుండేది. కానీ అవి ఏమీ చేయకుండా తన ప్రచార పిచ్చితో 750 కోట్ల రూపాయలు తగలేశారు జగన్. ఈ దుర్మార్గం గురించి తాజాగా వివరాలు వెలికి వస్తుండగా ప్రజలు ఇన్నాళ్లు ఇంత ఘోరమైన పరిపాలనలో మగ్గిపోయామా అని ముక్కున వేలేసుకుంటున్నారు.