వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఒక్కటే ఇక్కడ విషయం కాదు. ఎన్నికలన్నాక గెలవడం ఓడడం సహజంగా జరుగుతూ ఉండేదే. కానీ ఇప్పుడు వైసీపీ యొక్క దయనీయమైన పరిస్థితి ఏంటంటే… ఆ పార్టీలో ఉన్నవారు ఇప్పుడు ఎదురైన ఓటమి గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. సహజమే అనుకుంటున్నారు. కాకపోతే.. ఆ పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదని భయపడుతున్నారు. అలాంటి వారు వరుసగా పార్టీని వీడిపోతున్నారు.
రాజకీయంగా సన్యాసం అయినా తీసుకుని గడుపుతాం గానీ.. వైసీపీలో మాత్రం వద్దు అని డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ శాసనమండలిలో వలసలను ప్రారంభించేది ఎవరు? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం లేదు. అక్కడ వైసీపీకి మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి ఎమ్మెల్సీలు వలస వచ్చి తమ కూటమి పార్టీల్లో చేరాలని సహజంగానే అధికారంలో ఉన్నవారు ఆశిస్తారు. అయితే వారు అందుకోసం పెద్దగా ప్రయత్నించాల్సిన, ప్రయాసపడవలసిన అవసరం లేకుండానే ఆ పర్వం కూడా పూర్తయ్యేలా ఉంది.
పలువురు ఎమ్మెల్సీలు అధికార కూటమిలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా మండలి డిప్యూటీ ఛైర్మన్, రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానం ఇప్పుడు తెలుగుదేశంలో చేరబోతున్నారు. కొన్నిరోజుల కిందట ఆమె మంత్రి ఫరూక్ ను కలిసినప్పుడు.. పుకార్లు వచ్చినప్పటికీ కేవలం మర్యాదపూర్వకంగా కలిసినట్టు అప్పట్లో చెప్పారు.
తాజాగా ఆమె ఏకంగా నారాలోకేష్ తో జకియాఖానం కుటుంబం సహా భేటీ కావడంతో దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆమె తెలుగుదేశంలో చేరడానికి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జకియా తాను తెదేపాలోకి వస్తే.. తన వెంట మరికొందరు ఎమ్మెల్సీలను కూడా వెంటబెట్టుకుని వస్తారని రాజకీయ వర్గాల్లో అంచనాలు సాగుతున్నాయి. పార్టీలో ఉండేవాళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లు పోవచ్చు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎవరికి వారు తమ భవిష్యత్తు కోసం సర్దుకునేలా చేస్తున్నాయి.
ఇటీవల జగన్ ఢిల్లీ దీక్ష సందర్భంగా ఎమ్మెల్సీలు అందరినీ రమ్మని చెబితే.. ఇద్దరు మాత్రం మండలికి హాజరయ్యారు. వారు కూడా పార్టీ మారుతారని వినిపిస్తోంది. మొత్తానికి జకియాఖానం బోణీ కొట్టవచ్చునని అనుకుంటున్నారు.