తన పరువు తానే తీసుకుంటున్న జగన్!

జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఇలా తాను ఏం మాట్లాడినా తన పరువే పోతుందనే భయంతో మాత్రమే ఆయన గత ఐదేళ్లపాటు కేవలం రెండంటే రెండే మీడియా సమావేశాలు నిర్వహించారేమో.. అని కూడా అనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో రెండు ప్రెస్ మీట్ లు మాత్రమే నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారానికోమారు మీడియా ముందుకు వచ్చి తన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

ఇంతకూ ఆయన తన పరువు తాను ఏ రకంగా తీసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారు కదా? వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొద్ది రోజుల పరిపాలనలోనే అటవిక  ప్రభుత్వం రాజ్యమేలుతున్నట్లుగా, హింస చెలరేగుతున్నట్లుగా బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. తక్షణం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గుడ్డిలో మెల్లఏమిటంటే చంద్రబాబును తొలగించి తనను సీఎం చేస్తే తప్ప రాష్ట్రంలో శాంతిభద్రతలు  బాగుంటాయని ఆయన కేంద్రానికి ప్రతిపాదించకపోవడం!

మొత్తానికి ఢిల్లీలో తాను చేపట్టిన దీక్ష అత్యద్భుతంగా విజయవంతం అయిందని జగన్మోహన్ రెడ్డి, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. జగన్ దీక్షకు దేశంలోని అన్ని పార్టీల వారిని ఆహ్వానించాలని ఆయన నాలుగు రోజులు ముందు నుంచి పురమాయిస్తూ వచ్చారు. ఇంతాకలిపి  ఆయన దీక్షకు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్ధవ్ వర్గం కీలక నాయకుడు సంజయ్ రౌత్ తప్పితే పెద్ద నాయకులు ఎవరూ హాజరు కాలేదు. చిన్నాచితకా పార్టీల నుంచి మరికొందరు వచ్చి పలకరించి వెళ్లారు. ఈ మాత్రం దానికే జగన్ మురిసిపోవడం జరుగుతోంది.

అయితే ఈ విషయంలో తన పరువు మరింత పోయేలాగా ఆయన తాజాగా ఒక విషయం వెల్లడించారు. తాను ఢిల్లీలో చేసిన ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించామని జగన్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి సంబంధించి నింద వేయడానికి ఆయన ఈ మాట అన్నారు. కాంగ్రెస్ ఎందుకు రాలేదో ఆ పార్టీని అడగాలని జగన్ తిరస్కారంగా సెలవిచ్చారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన చెప్పినట్టుగా, దేశంలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తే, ఆయన పట్ల సానుభూతితో వచ్చినది కేవలం రెండు పార్టీల వారు మాత్రమేనా అని ప్రజలు ఇప్పుడు జాలి వ్యక్తం చేస్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు కావాలి అని అడిగితే కదిలి వచ్చే దిక్కు లేదని, కేవలం ఇద్దరిని చూసుకొని జగన్ మురిసిపోతున్నారని అంటున్నారు. ముగిసిపోయిన దీక్ష గురించి నోరు మెదపకుండా జగన్ ఊరుకుంటే సరిపోయేది. అనవసరంగా ‘అన్ని పార్టీలకు ఆహ్వానం పంపాను.. కాంగ్రెస్ ఎందుకు రాలేదో నాకు తెలియదు’ ఇలాంటి అనవసరమైన డైలాగులు వల్లించడం ద్వారా జగన్ ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories