వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో గులాబీ దళాలు ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటాయనడంలో సందేహం ఏమీ లేదు. కెసిఆర్ జగన్ ను పుత్ర సమానుడిగా భావిస్తుంటారు. అదేమాదిరిగా కల్వకుంట్ల తారక రామారావు కూడా తన సోదరుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ అనుబంధాలతో కూడిన రాజకీయం మంచిదే! అయితే ఈ ప్రేమ ముసుగులో వారు వాస్తవాలను విస్మరించి అంచనాలకు వెళుతున్నారు. అదే వారిని దెబ్బతీస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడని ఢంకా బజాయించి చెప్పినందుకు తండ్రీ కొడుకులు అభాసు పాలయ్యారు. అయితే వారి అనుబంధం దెబ్బతినలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా దీక్ష చేయగానే కల్వకుంట్ల తారక రామారావు కూడా అదే ఆవేశం పొంగుకొస్తున్నట్లుగా ఉంది.
అయితే తమ పార్టీ తరఫున ఢిల్లీలో దీక్ష చేస్తే ఇతరత్రా వేరే సంకేతాలు వెళతాయని భయం కూడా వెన్నాడుతున్నట్లుగా ఉంది. అందుకే కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా బడ్జెట్లో నిధులు కేటాయించుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన రెచ్చగొడుతున్నారు. అయినా రాష్ట్రానికి నిధులు కావాలని అడగడానికి ముఖ్యమంత్రి అయి ఉండాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఆ మాత్రం బాధ్యత లేకుండా పోతుందా? కేంద్రాన్ని నిలదీస్తే ఎవరైనా వారిని వద్దన్నారా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం?
కేటీఆర్ కు మాత్రం ఢిల్లీలో దీక్ష చేయాలని ఉన్నదని, అయితే ఒకవైపు తన సోదరి కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉండగా ఢిల్లీ సర్కారు మీద పోరాడుతూ దీక్ష చేయడం వలన మున్ముందు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన లో ఉన్నట్లుగా పలువురు అనుకుంటున్నారు. తాము చేయలేని పనిని రేవంత్ మీదికి నెట్టేసి వినోదం చూడాలని భారాస శ్రేణులు ఆశపడుతుండడం విశేషం.
రేవంత్ సభాముఖంగా కేసీఆర్ కు సవాలు విసిరారు. ప్రతిపక్ష నేతగా ఆయన కూడా వస్తే.. ఇద్దరం వెళ్లి ఢిల్లీలో దీక్ష చేద్దాం అని అన్నారు. టైం డేట్ వారినే చెప్పమని కూడా అన్నారు. నిజానికి ఇది కేసీఆర్ కు మంచి అవకాశం. రాష్ట్రం కోసం పోరాడడం మాత్రమే కాదు. అధికారంలో లేకపోయినా సరే.. రాష్ట్ర ప్రగతి కోసం కూడా పోరాడుతానని ఆయన నిరూపించుకోవాలంటే.. ఢిల్లీ దీక్షకు వెళ్లడం బెటర్ అని ప్రజలు అంటున్నారు.