ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ఒక విషయం వెల్లడించారు. దాన్ని గూఢార్థం ప్రకారం జగన్మోహన్ రెడ్డి సోదరుడు, ఆత్మీయుడు, పులివెందుల నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించిన వరకు ఆయనకు అన్నీ తానై వ్యవహరించే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రమాదఘంటికలు మోగినట్లేనా అని పలువురు అంచనా వేస్తున్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే ఐదేళ్ల నుంచి వినిపించే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలలో సంచలనం అవుతోంది. చంద్రబాబు పాలనలో వివేకానంద రెడ్డి హత్య కేసును త్వరలోనే ముగిస్తారని అవినాష్ రెడ్డిని పాత్ర బయటకు వస్తుందని అంటున్నారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన నాటి నుంచి ఈ కేసు ఎన్ని రకాల మలుపులు తిరుగుతున్నదో అందరికీ తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సిబిఐ విచారణను కోరినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పదేపదే కేసును పక్కదారి పట్టించే మాటలు మాట్లాడారు. వివేకాను కూతురు సునీత హత్య చేయించినట్లు అర్థం వచ్చేలా- అనేకమార్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. హత్య చేసిన వారు చేయించిన వారు అంతా క్షేమంగా బయట తిరుగుతున్నారంటూ చెల్లెలును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని గమనించాలి. అలాగే ‘అవినాష్ రెడ్డి అమాయకుడు, అనవసరంగా ఈ హత్య కేసును రుద్దుతున్నారు’ అని ఎన్నిసార్లు జగన్ కితాబు ఇచ్చారో లెక్కేలేదు.
సిబిఐ విచారణలో అనేక ఆధారాలు అవినాష్ పాత్రను నిర్ధారిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు మద్దతుగా అండగా నిలబడడం గమనించాలి. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందనిపించేలాగా ఆయన చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత ఇద్దరూ తీవ్రమైన పోరాటమే సాగించారు. వారికి ఎన్నికలలో పెద్దగా లాభించలేదు గాని, వివేకా హత్య వెనుక సామాన్య ప్రజలలో కూడా అనుమానాలు బలపడ్డాయి.
ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కడప ఎంపీ స్థానానికి ఉపఎన్నిక వస్తుందనే సంగతిని పలువురు నాయకులు పలు విధాలుగా సంకేతాలు ఇస్తున్నారు. అంటే అవినాష్ రెడ్డి అరెస్టు అయి జైలుకు వెళ్తారని ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ‘హూ కిల్డ్ బాబాయ్’ అనేది త్వరలో తెలుస్తుందంటూ చంద్రబాబు కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన సంకేతాలే ఇస్తున్నారని అందరూ భావిస్తున్నారు.