ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. తన పట్టుదల నెరవేర్చుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించి తీరవలసిందే అన్యాయం అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా స్పీకరుకు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి, అటువైపు నుంచి స్పందన లేకపోయేసరికి.. ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించాలని, అలా గుర్తించేలా స్పీకరును ఆదేశించాలని ఆయన పిటిషన్లో కోరారు. నిజానికి ఇది హైకోర్టు ద్వారా తేలే వ్యవహారం కాదు అని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి ఈ చర్య ద్వారా తన పరువు తానే తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని అనిపిస్తోంది.
‘శాసనసభలో 10 శాతం సీట్ల కంటే తగ్గితే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదు’ అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో, ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి. 23 స్థలాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురిని వైసీపీలో కలిపేసుకున్నారు జగన్. మరో ఇద్దరిని కలుపుకుంటే చాలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన స్వయంగా శాసనసభలోనే ప్రకటించారు. ఇప్పుడు అవన్నీ ఆయన మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది.
ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అందని ద్రాక్ష అయింది. ఆ మాత్రం అర్హతలు ప్రజలు ఆయనకు ఇవ్వలేదు. లేని అర్హతతో హోదా కోసం ఎగబడటం, ఆరాటపడడం ఆయనకు మాత్రమే చెల్లింది. శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన రోజున.. కేవలం సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ ను.. మంత్రుల తర్వాత ప్రమాణానికి పిలిచారు. నిజానికి ఆయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎమ్మెల్యేల మధ్యన వచ్చి ప్రమాణం చేయాలి. పోనీ పాపం అని మంత్రుల తర్వాత పిలిచినందుకు, ఆయన మరింతగా విర్రవీగుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఆనాడే ఫిక్స్ అయ్యారని, అందుకే తన అవమానించేలా మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారని జగన్ తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవలసినది ఏంటంటే.. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నిరాకరించినది స్పీకర్ కాదు- రాష్ట్ర ప్రజలు! ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోకపోతే జగన్ ముందు ముందు రాజకీయ భవిష్యత్తు కూడా క్లిష్టంగానే ఉంటుంది. అసెంబ్లీ గేటు బయట కారు దిగి లోపలికి నడిచి వెళ్లడాన్ని.. బహుశా అవమానంగా భావిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి స్పీకర్ స్పందించలేదు కనుక ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో కేసు వేశారు కానీ, అక్కడ కూడా భంగపాటు తప్పదని నిపుణులు అంటున్నారు.