జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీ కాలంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్ని పనులు చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎక్కడినుంచి వచ్చింది ఏ నిధులు వచ్చినా సరే.. వాటిని సంక్షేమ పథకాల ముసుగులో జనానికి పంచి పెట్టడానికే వినియోగించారు. అభివృద్ధి అనే మాటను గాలికి వదిలేశారు. ఫలితాన్ని అనుభవించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఇచ్చిన నిధుల విషయంలో జగన్ చేసిన గోల్ మాల్ ఎంత? అనేది లెక్క తేల్చడానికి ఇప్పుడు టీడీపీ ఎంపీలు నడుం బిగించారు.
లోక్ సభలో తెలుగుదేశం సభ్యులు మూడు స్టార్ ప్రశ్నలు సంధిస్తున్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరూ కలిసి మూడు ప్రశ్నలు అడిగారు. 1. గత ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం , కేంద్ర పథకాల కోసం ఏపీకి విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత? 2. ఆయా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చిందా? 3. ఆ కేంద్ర పథకాలు పూర్తిగా చేసినట్టుగా యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చిందా? అనేవే ఆ ప్రశ్నలు.
ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే జగన్ పాలన బండారం బయట పడిపోతుంది. జగన్ తన పాలన కాలంలో విచక్షణ లేకుండా.. డబ్బు దొరికితే చాలు.. ఎలా పడితే అలా ఖర్చు చేశారు. కేంద్ర నిధులు అన్నీ కూడా వాడేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు కేంద్ర సర్కారు సభాముఖంగా జవాబు ఇస్తే.. అధికారికంగా వెల్లడి అవుతుంది.