‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మా.. ఎవడమ్మా.. వాడెవడమ్మా..’ అంటూ ఓ సినీ కవి, ఆటపట్టించే పాట రాశాడు. కానీ.. ఇప్పుడు వ్యవహారం ఆట పట్టించడానికి సంబంధించినది కానే కాదు. చాలా సీరియస్ వ్యవహారం. విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకున్నారు. ఆమె భర్త ఎవరో ధ్రువీకరించి, నిజం చెప్పాల్సిందిగా ఆశాఖ ఉన్నతాధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. గిరిజన మహిళ అయిన శాంతి 2020లో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగంలో చేరారు. నిజం చెప్పాలంటే.. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ, అర్హత నిమిత్తం.. మూడేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా చేసినట్లు ఆమె సమర్పించిన పత్రాలు కూడా నకిలీ అనే ఆరోపణ ఉంది. మొత్తానికి ఉద్యోగం వచ్చింది. కోట్లకు కోట్లు వెనకేశారు. అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్నది తనకు ఎంతో సన్నిహితుడైన, ఆయన దృష్టిలో తనను కూతురులాగా చూసుకునే విజయసాయిరెడ్డి అండ ఉన్నది గనుక.. ఆ ఆరోపణలను ఖాతరు చేయకుండా విచ్చలవిడిగా చెలరేగిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సస్పెండ్ అయ్యారు.. ఆమె మీద శాఖాపరమైన విచారణ జరుగుతోంది. ఈలోగా విజయసాయిరెడ్డితో సాన్నిహిత్యం ద్వారా కొడుకున్న కన్నారంటూ భర్త మదన్ మోహన్ ఆరోపించడం జరిగింది.
దానికి కౌంటర్లు ఇచ్చిన శాంతి, తాను 2016లోనే భర్త మదన్ మోహన్ తో గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నానని, తర్వాత న్యాయవాది సుభాష్ రెడ్డిని పెళ్లిచేసుకున్నానని… మీడియా మీట్ లో ప్రకటించారు.
ఆ ప్రకటన ఇప్పుడు ఆమె కొంప ముంచుతోంది. తాజాగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమెకు నోటీసులు పంపారు. 2020లో ఉద్యోగంలో చేరిన శాంతి.. రికార్డుల్లో తన భర్త పేరును మదన్ మోహన్ గా పేర్కొన్నారని.. కానీ ప్రెస్ మీట్ లో మదన్ మోహన్ కు 2016లోనే విడాకులు ఇచ్చినట్టుగా చెబుతూ.. సుభాష్ రెడ్డిని వివాహమాడినట్టు రాశారని వారు లేవనెత్తారు. అసలు ఇంతకూ ఆమె భర్త పేరేమిటో, ఎవరో చెప్పాలని లేకపోతే మోసపూరిత డాక్యుమెంట్లతో, వివరాలతో ఉద్యోగంలో చేరినట్టుగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
పాపం.. శాంతి.. ఇన్నాళ్ల తర్వాత తన భర్త ఎవరో ‘అధికారికంగా’ చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా చెప్పడానికి బహుశా కుదరకపోవచ్చు.