రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితుల పరంగా అల్లకల్లోలం సృష్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రరచన చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే, తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయంటూ అడ్డగోలు ఆరోపణలతో ఆ పార్టీ వారు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మద్యం దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి హత్యకు గురైతే.. దానికి రాజకీయ రంగు పులిమి.. పరామర్శ కోసం జగన్ వినుకొండ వెళుతున్న సందర్భంగా కూడా అల్లర్లకు రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ వారు కూడా వారి దగ్గరకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తెదేపా కార్యకర్తలు కూడా గత అయిదేళ్లలో వారి అవినీతిని ప్రశ్నిస్తున్నారు.
కొన్నిరోజుల కిందట తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకనాధ రెడ్డిని స్థానికులు వ్యతిరేకించారు. దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిన ఆయన వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. తంబళ్లపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతే తప్ప పరిస్థితులు అదుపు తప్పలేదు. అయితే.. ఆ సంఘటన తర్వాత.. వైసీపీ నాయకులకు కొత్త అయిడియా వచ్చినట్టుంది.
గతంలో పోలీసులు వద్దని చెప్పినప్పటికీ.. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పుంగనూరు పర్యటన ప్లాన్ చేసుకుని.. పరిస్థితులు అదుపు తప్పేలా ప్రణాళిక రచించారు. ఘర్షణలు జరిగాయి. వారు కోరుకున్నదే జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటివి జరిగితే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నట్టుగా ప్రభుత్వంపై బురద చల్లవచ్చునని వారి ప్లాన్ గా తెలుస్తోంది.
దానికి కొనసాగింపుగానే.. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. రషీద్ హత్య అనేది కేవలం ఒక మిష. తన పర్యటన ద్వారా.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్ వెళుతున్నారని తెలుస్తోంది. పోలీసులు ఆయన పర్యటనను ఆపడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ జగన్ వెళ్లడం అనివార్యం అయితే.. వినుకొండలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడుతున్నారు.