ఏ ఆరోపణల గురించి అయితే వారు ఎక్కువ సీరియస్ అయ్యారో.. అవి పెద్ద ఇబ్బందిగా మారకపోవచ్చు. కానీ చాప కింద నీరు లాగా జరుగుతున్న విచారణ తీరును గమనిస్తే, ఆ ఇద్దరు కలిసి శిక్షలు ఎదుర్కొనే ప్రమాదం లేదని చెప్పలేం. భూకబ్జాలు, దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులను స్వాహా చేసిన వైనం ఇవన్నీ కలిసి వారిని కటకటాల వెనక్కు పంపే అవకాశం ఉంది. విచ్చలవిడిగా సాగించిన దందాలు, అనుచిత మార్గంలో సహకరించిన తీరు ఇవన్నీ కూడా ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇద్దరి పాత్రలు బయటకు రానున్నాయి.
వీరిద్దరి గురించి శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణల సంగతి పక్కన పెట్టండి. ఆ ఇద్దరికీ జమిలిగా అసలు ప్రమాదం మరొకవైపు నుంచి పొంచి ఉంది. భర్త చేసిన ఆరోపణలకు సంబంధించి.. ఈ ఇద్దరి మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో మనకు తెలియదు. ఆయన హోం మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని వెల్లడించారు. అదే సమయంలో.. విజయసాయికి డిఎన్ఏ టెస్టులు కూడా చేయించాలని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ వివాదం ఎటుపోయినా.. అక్రమాల పర్వం మాత్రం వారిని వదిలిపెట్టేలా లేదు.
విజయసాయిరెడ్డి విశాఖలో విచ్చలవిడిగా సాగించిన భూదందాలకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి బాగా సహకరించారనేది ప్రధాన ఆరోపణ. ఆమె మీద ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంది. విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ త్వరలోనే ఒషక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని.. నివేదికను బట్టి ఆమె మీద చర్యలు ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. శాంతి మీద శాఖాపరమైన విచారణ పూర్తయి చర్యలు తీసుకునే దశ వస్తే.. అప్పుడు ఖచ్చితంగా విజయసాయి పాత్ర కూడా తేలుతుందని అంటున్నారు.
మదన్ మోహన్ చేసిన ఆరోపణల గురించి శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి కళ్లలో నిప్పులు కురిపించారు. కానీ.. అక్రమాల విచారణ విషయంలో వారు నోరుమెదకపకపోవడమే.. అనేక అనుమాలను కలిగిస్తోంది.