జనసేనాని పవన్ కల్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యే అయి చట్టసభలో అడుగుపెట్టి ఉండవచ్చు గాక! మొదటిసారే డిప్యూటీ ముఖ్యమంత్రి అయి గురుతర బాధ్యతలను మోయడంలో నిత్యవిద్యార్థి రాత్రింబవళ్లు ఫైల్స్ అధ్యయనం చేస్తూ ఉండవచ్చు గాక! కానీ ఆయన వ్యవహార సరళిలోని రాజకీయ పరిణతి కూడా అపూర్వంగా, గొప్ప సంయమనంతో కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మామూలుగా ఎన్నికలకు ముందు.. సమావేశాలు సభల్లో రెచ్చిపోయే మాట్లాడే దూకుడుగల నాయకుడిగా ముద్రపడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు.. ఎంతో పరిణతి గల నాయకుడిలాగా వ్యవహరిస్తుండడం అందరినీ విస్తుగొలుపుతోంది.
ఇప్పుడు రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సీజను నడుస్తోంది. సహజంగానే కూటమి పార్టీల నాయకుల మీద ఒత్తిడి ఉంటుంది. పవన్ కల్యాణ్ తనను కేవలం టీటీడీ ఛైర్మన్ పదవి కోసం యాభై మంది అడుగుతున్నట్టు చెప్పారు కూడా. కానీ.. పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ వారితో నిర్వహించిన ఒక సమావేశంలో.. చాలా స్పష్టంగా చెప్పారు. అర్హతలకు తగినట్టే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం అని చెప్పడం గొప్ప విషయం. గత ప్రభుత్వ హయాంలో అయితే ఆశ్రితులు కావడం ఒక్కటే నామినేటెడ్ పోస్టులకు కొలబద్ధగా ఉండేది. కానీ పవన్ కల్యాణ్ అర్హతల సంగతి చెప్పడం గమనించాలి.
అలాగే.. తెదేపా భాజపాలను తగ్గించి మాట్లాడవద్దు అని కూడా పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేశాం గనుక.. నాయకుడు ముఖప్రీతికోసం.. కూటమిలోని ఇతర పార్టీలను నిందించేవారు.. విజయం సాధించడంలో వారి ఘనత ఏమీ లేదని, కేవలం పవన్ కల్యాణ్ వల్లనే అందరూ గెలిచారని ఆయన ముందు అతిశయమైన మాటలు మాట్లాడుతూ.. అలాంటి మెరమెచ్చు మాటల ద్వారా ఆయనను బుట్టలో వేసుకోవాలని చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ అలాంటి మాయ మాటలకు తాను లొంగేది లేదని.. పవన్ నిరూపించుకున్నారు. ఈ విజయం సమష్టిగా మూడు పార్టీలు కలిసి సాధించినదని, ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని ఆయన సొంత పార్టీ వారికే హితవు చెబుతున్నారు. అలాగే.. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దేవరకు అందరమూ కలిసే ప్రయాణించాలని ఆయన వారికి నచ్చజెప్పడం కూడా శుభపరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.