దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా అధికారి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నదనేది ప్రధాన ఆరోపణ. ఆయన ద్వారా.. ఆమె గర్భం దాల్చారని ఆమె భర్త ఆరోపించడం వల్ల వివాదం వెలుగులోకి వచ్చింది. భర్త ఆరోపణలు వైరల్ అయిన నేపథ్యంలో సదరు మహిళా అధికారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అవుతూ తన వివరణ చెప్పుకున్నారు. అయితే.. ఆమె మాటల తర్వాత కూడా ఇంకా అనేక సందేహాలు మిగిలే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. మహిళా అధికారి వివరణ తర్వాత కూడా ప్రజల్లో సందేహాలే ఉన్నాయి.
తాను విదేశాల్లో ఉండగా తన భార్య, వైసీపీ నేత విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉండి బిడ్డను కన్నదంటూ మదన్ మోహన్ మానిపాటి అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. ఆమె దేవాదాయ శాఖలో ఉన్నద్యోగిని. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మదన్ మోహన్ తో తాను 2016 లోనే విడిపోయానని, తరువాత సుభాష్ అనే లాయరును 2020లో పెళ్లి చేసుకుని అతనితోనే జీవిస్తున్నానని.. అతనితోనే బిడ్డను కన్నానని ఆమె అంటున్నారు. విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలో మాత్రమే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని చెప్పారు. గిరిజన మహిళను కాబట్టి తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతి చేయలేదని అంటున్నారు. ఆమె మీద అనేక అభియోగాలు వస్తుండగా.. కొన్నింటితో తనకు సంబంధమే లేదని కూడా అంటున్నారు.
అంతా బాగానే ఉందిగానీ.. సదరు మహిళా అధికారి చెబుతున్న విడాకులు, రెండో పెళ్లి అనేవి చెల్లుబాటు అయ్యేవేనా అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహాలు. ఎందుకంటే.. ఆమె 2016లో తాను గిరిజన సాంప్రదాయం ప్రకారం మదన్ మోహన్ తో విడాకులు తీసుకున్నానని అంటున్నారు. గిరిజన సాంప్రదాయం అన్న తరువాత.. తాను ఏం చెబితే అది చెల్లుతుందని ఆమె అనుకున్నారేమో తెలియదు. మనదేశంలో హిందూ వివాహ చట్టం, ముస్లిం పర్సనల్ లా వంటి ఉన్నాయి గానీ.. గిరిజనుల విడాకులకు ప్రత్యేక పద్ధతులను అనుమతించే చట్టాలు ఉన్నాయా? అనేది ప్రజల సందేహం. అలా లేనప్పుడు, ఆమె చెబుతున్న గిరిజన విడాకులకు న్యాయపరమైన చెల్లుబాటు ఉంటుందా అనేది చూడాలి. అలాగే.. ఇంకో వివాహం చేసుకున్నానని ఆమె స్వయంగా అంటున్నారు. మొదటి వివాహం రద్దు కాకుండానే మరో వివాహం చేసుకున్నందుకు ఆమె మరో నేరం చేసినట్టు అవుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.