జగన్ బొమ్మల పిచ్చికి మంగళం పాడేస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఆశలు ఉన్నాయి. ఆయన మంచి పరిపాలన అందించి ప్రజల హృదయాలలో నిలిచిపోవాలని కోరుకుంటే అందులో తప్పులేదు. అలా కాకుండా ఆఫీసుల మీద, ప్రజల ఇళ్ళ మీద, శిలాఫలకాలు మీద, అన్నింటి మీద తన బొమ్మలు ముద్ర వేయించి ఆ రకంగా తాను చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటేనే అసహ్యంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ఫోటో తగిలించడం తప్పు కాదు. కానీ కార్యాలయం బయట కార్యాలయం పేరు రాసిన చోట కూడా ఆయన ఫోటోలు బొమ్మలు ఉండాలని కోరుకోవడం అతిశయోక్తి. అవన్నీ రాచరికపు పోకడలు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోగో తోనే ఇలాంటివన్నీ జరగాలి. ప్రభుత్వం అంటూ ఏమీ లేదు రాష్ట్రానికి సంబంధించి అన్నీ నేనే అనుకునే తరహాలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. అందుకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల బయట బోర్డుల పక్కన తన ఫోటోలను పెద్ద పెద్దవిగా పెట్టించారు. వాటిని ఇప్పుడు తొలగించడం కూడా జరిగింది. అదే మాదిరిగా ఎక్కడ ఏ పనులకు శ్రీకారం చుట్టినా శిలాఫలకాలు అన్నింటి మీద తన ఫోటోలు ముద్రింప చేశారు. . పొలాలకు హద్దురాళ్ళు నాటే ప్రక్రియలో కూడా రాళ్ళ మీద తన బొమ్మలు వేయించారు. రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మీద అవేదో తన ఆస్తులు అయినట్లుగా లేదా తన ఆస్తులను వారికి ఇస్తున్నట్లుగా తన ఫోటోలు ముద్రించి ఇచ్చారు. ప్రభుత్వ లోగో ఉండాలని ప్రజలు ఊహించే ప్రతిచోట జగన్ తన బొమ్మతో రీప్లేస్ చేశారు.

ఇలాంటి దుర్మార్గమైన బొమ్మ పిచ్చికి తెలుగుదేశం పార్టీ నాయకులు భరత వాక్యం పలుకుతున్నారు. జగన్ బొమ్మలను తొలగించాల్సిందిగా చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నారు. పొదిలిలో సామాజిక వైద్యశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అక్కడ శిలాఫలకం మీద ప్రభుత్వ లోగో లేకపోగా జగన్మోహన్ రెడ్డి బొమ్మల ఉండడాన్ని ఆక్షేపించారు. జగన్ బొమ్మలను వెంటనే తొలగించాలంటూ అధికారులను పురమాయించారు. జగన్ ఏదో తన జేబులో నిధులు ఖర్చుపెట్టి పనులు చేయిస్తున్నట్లుగా ఫోటోలు వేయించుకున్నారని ఆ శిలాఫలకాల స్థానే ప్రభుత్వ లోగో ఉండేవి తయారు చేయించాలని మంత్రి పురమాయించారు.

పొలం హద్దురాళ్లను కూడా పూర్తిగా తొలగించి జగన్ బొమ్మ లేకుండా ప్రభుత్వ లోగో తోనే రాళ్ళను వేయించే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విచ్చలవిడిగా చెలరేగిన  జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చికి ఈ రకంగా కొత్త ప్రభుత్వం మంగళం పాడేస్తున్నది.

Related Posts

Comments

spot_img

Recent Stories