చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మరో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి- చెప్పిన మాట ఒకటిగా, చేసే తీరు ఒకటిగా ప్రజలను మభ్యపెడుతూ వస్తున్న కాలంలో.. ఎన్నికలవేళ ‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు అకౌంట్లలో జమ చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల అయింది. జగన్ అమ్మ ఒడి పేరుతో చెప్పిన మొత్తం తల్లులకు ఇవ్వకుండా, వారికి ఇచ్చే మొత్తంలోంచి పాఠశాల నిర్వహణ పేరిట కోతలు విధిస్తూ నిధులు విడుదల చేశారు. అలాగే ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తిస్తుందని తొలిత హామీ ఇచ్చినప్పటికీ తర్వాత మాట తప్పారు.
చంద్రబాబు నాయుడు- ఒక తల్లికి ఎందరు పిల్లలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చాలా స్పష్టంగా ఎన్నికల సమయంలో చెప్పారు. అలాగే ఈ మొత్తాన్ని పెంచి తల్లికి వందనం పేరిట రూ.15000 వంతున అందజేస్తామని కూడా అన్నారు. ఆమేరకు ఇవాళ జీవో కూడా వచ్చింది. ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం నిధులు అందుతాయి. అయితే 75 శాతం హాజరు అనేది తప్పనిసరి. హాజరు నిబంధన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో కూడా ఉంది. అప్పటిలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్తగా లబ్ధి పొందుతున్న వారి వివరాలను ఆధార్ తో అనుసంధానం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తానికి సంక్షేమ పథకాల అమలులో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎక్కడైతే తేడాగా వ్యవహరిస్తున్నదో.. అక్కడ చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధిని అంకితభావాన్ని నిరూపించుకుంటున్నారు. విద్యార్థుల చదువులు సక్రమంగా కొనసాగడం పట్ల ఉన్న శ్రద్ధను నిరూపించుకుంటూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ కలిపి ఈ నిధులు అందేలా నిబంధనలు రూపొందించడం ప్రశంసార్హం.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తింజేసే ఆలోచన ఎంత బాగున్నదో.. అదే స్థాయిలో ప్రెవేటు పాఠశాలల్లో చదివించే వారికి వర్తించకుండా నిబంధన తీసుకువస్తే.. ప్రభుత్వ పాఠశాలల పరిపుష్టం అవుతాయని కూడా కొన్ని వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.