మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనేది నాయకుడి చిత్తశుద్ధిలో ఉండాలి. పనిచేసే తీరులో ఉండాలి. కేవలం మాటల్లో మాత్రమే అలాంటి పడికట్టు పదాలు వాడుతూ.. భూదందాలు సాగించాలనుకుని అనుకునే జగన్మోహన్ రెడ్డి వంటి వారికి అది తెలియదు. రాజధాని అనే పదమే అభివృద్ధి అయినట్టుగా, జగన్, ఒక్క చాన్స్ దక్కినందుకే, రాష్ట్రాన్ని కనీసం రెండుదశాబ్దాల వెనక్కు తీసుకువెళితే.. ఇప్పుడు చంద్రబాబునాయుడు మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. అన్ని ప్రాంతాల పురోగతి మీద దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమకు మరో భారీ పరిశ్రమను కానుకగా ఇవ్వనున్నారు చంద్రబాబు!
ప్రపంచంలోనే విద్యుత్తు వాహన తయారీ రంగంలో మంచి పేరున్న వియత్నాంకు చెందిన సంస్థ విన్ ఫాస్ట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. రాయలసీమలో పరిశ్రమ ఏర్పాటుచేస్తే వారికి అవసరమైన భూవసతి మొత్తం ఏర్పాటుచేస్తాం అంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ సంస్థ విద్యుత్తు వాహనాలు, బ్యాటరీలు తయారుచేయడంలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంది.
గతంలో చంద్రబాబునాయుడు పరిపాలన హయాంలోనే ఏపీకి కియా సంస్థ వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కియా ద్వారా ఎంత అభివృద్ధి సాధ్యమైందో, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. జగన్ అధికారంలోకి రాగానే కియా సంస్థను అక్కడినుంచి వెళ్లగొట్టడానికి ఎలాంటి వేధింపులు చేశారో కూడా తెలుసు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే.. బహిరంగ వేదిక మీదనే కియా సంస్థ ప్రతినిధులను బెదిరించిన వైనం కూడా ప్రజలు గమనించారు. చంద్రబాబునాయుడు సంస్థలను తీసుకువస్తోంటే.. వైసీపీ సర్కారు వెళ్లగొడుతోందంటూ విమర్శలు కూడా వచ్చాయి.
కియా స్థాయిలోనే మరో అంతర్జాతీయ విద్యుత్తు వాహనాల తయారీ సంస్థను రాయలసీమకు కానుకగా అందించేందుకు ఇప్పుడు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వారి యూనిట్ ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. వారు ఆ ప్రాంతంలో పర్యటించి నిర్ణయం తీసుకుంటారు. వారికి సహకరించాల్సిన బాధ్యతను మంత్రి టీజీ భరత్ కు అప్పగించారు చంద్రబాబు. వారు రాయలసీమలో ఎక్కడ ప్లాంట్ ఏర్పాటుచేస్తారనే విషయంలో నెలరోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.