అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నికి పరమాన్నం పెడతాడనేది సామెత. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, వ్యవహార సరళి గమనిస్తే.. ఈ సామెత ఆయనకు చాలదు అనిపిస్తోంది. ‘అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్ని తోడికోడలుకు పరమాన్నం పెడతాడట!’ అని మార్చి చదువుకోవాలి. ఎందుకంటే.. వైఎస్ షర్మిల కు రాజకీయ పదవి దక్కేలా చూస్తానని ఊరించడం కోసం.. రేవంత్ర మాటలు అలాగే కనిపిస్తున్నాయి.
షర్మిల తన రాజకీయ జీవితాన్ని తెలంగాణలో సాగించాలని అనుకున్నారు. ఆమె సొంత పార్టీ పెట్టుకుని, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి నానా కష్టాలు పడిన తర్వాత.. చివరికి కాంగ్రెసులో విలీనం చేశారు. అందుకు రాజ్యసభ సభ్యత్వం ఆశించారనేది అప్పట్లో వినిపించిన మాట. కానీ కాంగ్రెస్ ఆ విషయం పట్టించుకోలేదు సరికదా.. తెలంగాణ రాజకీయాల్లోనే ఆమెను ఉండనివ్వకుండా ఏపీకి తరలించేశారు. ఏపీసీసీ సారథ్యం కట్టబెట్టాక.. ఆమె కడప ఎంపీగా పోటీచేశారు గానీ.. ఆమె విజయం కోసం పార్టీ తరఫు నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఢిల్లీ పెద్దలు, రేవంత్ ఎవ్వరూ వచ్చి ప్రచారం చేయలేదు.
నిజానికి తెలంగాణలో తన పార్టీని పణంగా పెట్టినందుకు షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి ఉంటే.. రేవంత్ రెడ్డి అమ్మకు అన్నం పెట్టినట్టుగా ఉండేది. ఆయన ఆ పనిచేయలేదు. కనీసం కడప ఎంపీ ఎన్నికల ప్రచారంలో సహకరించి ఆమెను గెలిపించి ఉంటే.. కనీసం పిన్నికి పరమాన్నం పెట్టినట్టుగా ఉండేది. అదీ ఇదీ కాకుండా.. కడప ఎంపీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని ఒక ఊహను వ్యాప్తి చేస్తూ, అప్పుడొచ్చి ఆమెకు అనుకూలంగా ప్రచారం చేస్తానని అనడం అంటే.. పిన్నికి కాదు కదా..పిన్ని తోడికోడలుకు పరమాన్నం పెట్టినట్టుగా ఉన్నదనం జనం నవ్వుకుంటున్నారు.
షర్మిలలో ఇప్పటికీ.. తనకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందనే ఆశలు ఏమైనా మిగిలి ఉంటే.. వాటిని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి .. ఈ ఉపఎన్నిక ప్రస్తావన తెచ్చారని కూడా కొందరు అనుమానిస్తున్నారు.