తండ్రి విషయంలోనూ నిజాయితీ లేని జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు పరిపాలన సాగించారు. ప్రజలకు తాను ప్రొవైడర్‌ను, వారి కష్టాలను తన చేత్తో తుడిచి పెట్టేసే దేవుడిని అని ఆయన భావించుకున్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారు. తన ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా తనకు విధేయులుగా ఉండాలని రుణపడి ఉండాలని వాళ్లు బతికినంత కాలం తనకే ఓట్లు వేస్తూ ఉండాలని ఆయన ఆశించారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా కలగన్నారు. ప్రజలతో ఏ ఒక్క మాట కూడా నిజాయితీగా మాట్లాడే అలవాటు లేని నాయకుడు జగన్. అలాంటి వైఖరి పర్యవసానంగానే ఆయనకి అత్యంత దారుణమైన ఓటమి ఎదురైంది. కనీసం తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా తన మాటలను చెప్పడం లేదు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్.. అనేకమంది వైఎస్ఆర్ నిజమైన అభిమానులను మనస్థాపానికి గురి చేసేలా ఉంది.

‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం  మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం.
 
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. కానీ వైఎస్ పేరును తన ఓటుబ్యాంకుగా వాడుకోవడమే తప్ప, ఆయన మార్గాన్ని అనుసరించడంలో జగన్ కు చిత్తశుద్ధి ఉన్నదా? అనే సందేహాలుప్రజలకు కలుగుతున్నాయి.

వైయస్సార్ ను ఎంతమంది జయంతి రోజు గుర్తు చేసుకున్నారు- అనే సంగతి పక్కన పెడితే ఆయన చూపించిన మార్గాన్ని, క్రమశిక్షణను, కఠోర పరిశ్రమను తాను అనుసరిస్తానని జగన్ చెప్పడం కామెడీగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రతి ఉదయం తన క్యాంపు కార్యాలయానికి ప్రజలను అనుమతించేవారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించేవారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంతకాలము ఏ పేదవాడిని దగ్గరకు కూడా రానివ్వలేదు. వైయస్సార్ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ కార్యక్రమాలను నిర్వహించిన నాయకుడైతే.. జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కాడానికి ఊర్లు తిరుగుతూ.. ఆయన సభ అనేది ఒక ప్రజా కంటక వ్యవస్థగా, ప్రజలను భయపెట్టే వ్యవహారంగా మారడానికి కారకులయ్యారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజుల్లో.. తండ్రికి సన్నిహితులైన నాయకులందరినీ అందులో చేర్చుకుని- క్రమక్రమంగా అందరినీ పక్కన పెట్టారు. వైయస్సార్ తో ఆత్మీయ అనుబంధమున్న ఏ ఒక్కరూ తన పార్టీలో లేకుండా జాగ్రత్త పడ్డారు జగన్. ఇన్ని ఉదాహరణలు అనవసరం.. తన సాక్షి పత్రికలో వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి, పత్రిక లోగో పక్కనే వైయస్సార్ బొమ్మ కూడా ఉంచడం ఆయన అనుసరించిన జీవిత సత్యాలను సూక్తులు లాగా ఇవ్వడం పాటించేవారు. సాక్షి టీవీ లోగో వద్ద వైయస్సార్ బొమ్మను ఉంచేవారు. సరిగ్గా ఎన్నికలకు కొంతకాలం ముందు సాక్షి పత్రిక, టీవీ ఛానల్ రెండింటి మీద వైయస్సార్ ముద్ర అనేది లేకుండా చేశారు జగన్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఉండే ప్రజాదరణకు అతీతంగా సంబంధం లేకుండా తననే దేవుడి లాగా ప్రజలు ఆదరించాలని ఆయన సాహసించారు. ప్రజలు ఎంత నీచమైన ఓటమిని కట్టబెట్టారో అందరికీ తెలుసు. తీరా తండ్రి జయంతి వచ్చేసరికి మాత్రం ‘మీ ఆశయాల సాధన మీరు చూపిన బాటలో నడవడం చేస్తాను’ అంటూ కల్లబొల్లి మాటలతో తన సోషల్ మీడియా ట్వీట్లను వండుతున్నారు జగన్మో హన్ రెడ్డి. ఓడిపోయినా సరే జగన్ నిజాయితీగా ఉండడాన్ని అలవాటు చేసుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories