చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని ప్రారంభించారు. తెదేపా ప్రభుత్వం నూతన ఇసుక విధానానికి ఇంకా రూపకల్పన జరగాల్సి ఉంది. అది జరిగే వరకు ప్రస్తుతం ఇసుక నిల్వ పాయింట్లలో ఉన్న సుమారు 48 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించే ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇసుకకు ధర లేకుండా కేవలం తవ్వకానికి అయ్యే ఖర్చు, సీనరేజీ చార్జీలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే ప్రజలనుంచి వసూలు చేస్తారు. మొత్తానికి జగన్ సర్కారు పాలన సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రజలకు ఊహించనంత చవకగా ఇసుక లభిస్తోంది. ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మూడు రకాలుగా ప్రజలు చంద్రబాబునాయుడుకు నీరాజనాలు పడుతున్నారు.
మొదటిది- ఇసుక ఉచితంగా ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ట్రాక్టరు ఇసుక సగటున 4-5 వేల రూపాయల ధర పలికేది. బ్లాక్ లో 6వేలకు మించి ఇసుక ట్రాక్టరు విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏడాదికి 870 కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఆ మొత్తం ప్రభుత్వానికి వచ్చిన మాట నిజమే గానీ, ఇసుక ముసుగులో ఏడాదికి యాభైవేల కోట్ల రూపాయల వరకు వైసీపీ నేతలు స్వాహా చేస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు కొత్త విధానంలో ఒక ట్రాక్టరు ఇసుక కనిష్టంగా 800 రూపాయలకే దొరికే అవకాశం ఉంటుంది. బోట్ మెన్ లో నదిలోకి వెళ్లి తెచ్చే ఇసుక విక్రయించే ప్రాంతాల్లో మాత్రం ధర ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. జగన్ పాలనలో ఇసుక ధర కంటె ఇప్పుడు దాదాపు నాలుగోవంతు ధరకే ఇసుక లభించినందుకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండోది- జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. కొత్త ఇసుకవిధానం తీసుకువస్తానంటూ.. సుమారు ఏడాది పాటూ ఇసుకసరఫరాను బంద్ చేశారు. అప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం మొత్తం స్తంభించిపోయింది. భవన నిర్మాణ కూలీలుగా జీవితాలు సాగించే వారిలో వందల మంది ఆకలిచావులు చచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు అలాంటి ఘోరం చేయలేదు. కొత్త ఇసుక విధానం తేవడానికి కసరత్తు చేస్తున్నారు గానీ.. అప్పటిదాకా విక్రయాలు స్తంభించకుండా.. ఉన్న 48లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాటును ప్రారంభించేశారు.
మూడోది- జగన్ పాలన కాలంలో ఇసుక కొనుగోలుకు కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఉండేవి. డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేవారు కాదు. కేవలం ఈ ఒక్క కారణం చేత.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు సాగించిన దోపిడీని మొత్తంగా లెక్కకడితే.. ఏడాదికి 50వేల కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. అయితే.. చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక పంపిణీ విధానంలో కూడా వారు చెల్లించే కనీస చార్జీలను కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే చెల్లించే వ్యవస్థ తెచ్చారు. దీనివల్ల దోపిడీలేని పారదర్శకత పెరిగింది.
ఈ మూడు కారణాల చేత కొత్తగా తెచ్చిన ఉచిత ఇసుక విధానం విషయంలో చంద్రబాబును ప్రజలు కీర్తిస్తున్నారు.