ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
2019, 2021 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ను విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో వెల్లడించారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వివరించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు.