అమరావతి రాజధాని నగరంలో ప్రభుత్వ ప్రెవేటు నిర్మాణాలు అన్నీ శరవేగంగా జరిగే అవకాశం ఉన్నదా? చంద్రబాబు తీసుకున్న ఒక్క నిర్ణయం, కేంద్రం ప్రభుత్వంతో సత్సంబంధాల వలన సాధించుకు వచ్చిన ఒక్క హామీ కారణంగా.. అమరావతి నగర నిర్మాణాలు అనూహ్యమైన వేగంతో జరగబోతున్నాయా? అనే ప్రశ్నలు ఎదురైతే గనుక.. అవుననే సమాధానమే వస్తుంది. చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకువచ్చారు. అమరావతి నగర నిర్మాణం విషయంలో అందరూ ఉత్సాహంగా ముందుకు రావడానికి ఇది పెద్ద ముందడుగు అని పలువురు భావిస్తున్నారు.
భూసేకరణతో కలిపి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు భరించి.. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టడానికి కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చింది. అమరావతి రాజధాని విషయంలో ఇది చాలా కీలకమైన ముందడుగు. ఓఆర్ఆర్ పనులు ప్రారంభం అయితే గనుక.. అది హద్దుగా.. నగరంలో ప్రతిచోటా నిర్మాణాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా తెచ్చింది. దాదాపు 150 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో వారు కార్యాలయాలు నిర్మించుకోవడానికి సిఆర్డీయే అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ఓఆర్ఆర్ పనులు జరగడం మొదలైతే గనుక.. ఈ సంస్థలన్నీ కూడా తమ తమ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టడానికి చురుగ్గా కదులుతాయి. రాజధాని నిర్మాణంపై అందరికీ విశ్వాసం ఏర్పడుతుంది. రాజధానికి భూములు కేటాయించిన రైతులకు వారి వాటాగా లభించి స్థలాలను కనీసం ఒక ఏడాదిలోగా నిర్దిష్టంగా కేటాయించగలిగితే గనుక.. అమరావతి వ్యాప్తంగా ప్రెవేటు నిర్మాణాలు కూడా వేగంగా మొదలవుతాయి. వెరసి ఒకే ఒక్క అవుటర్ రింగ్ రోడ్డు అనే ప్రాజెక్టు వలన.. అమరావతి నగర నిర్మాణంలో అనూహ్యమైన వేగం వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇది కేంద్రం ద్వారా చంద్రబాబు సాధించిన విజయంగా ప్రజలు పరిగణిస్తున్నారు.