సుమారు 45 వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమార్జనలకు పాల్పడినందుకు దాదాపు దశాబ్దానికి పైగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. కోర్టుకు హాజరు కావలసి వచ్చిన ప్రతి సందర్భంలోనూ, ఎగ్గొట్టడానికి ఆయన అనేక విధాల వ్యూహాలు రచించేవారు. గత ఐదేళ్లుగా కాలం కలిసి వచ్చింది. ‘‘ముఖ్యమంత్రిగా ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను’’ అంటూ కోర్టు హాజరీని తప్పించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయిన తర్వాత, విధిగా కోర్టుకి హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కోర్టుకు రావాల్సిందిగా ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. అదొక ఎత్తు అయితే.. ఇప్పుడు జగన్ మీద ఉన్న అవినీతి, అక్రమార్జనల కేసులు వేగం పుంజుకున్న నేపథ్యంలో.. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దయ్యే అవకాశం ఉన్నదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
జగన్ మీద ఉన్న అక్రమార్జనల కేసులను రోజువారీ పద్ధతిలో విచారించాలని హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించడం అనేది చాలా కీలక పరిణామం. సాక్షాలు, ఆధారాలు సేకరించడం, చార్జిషీట్లు నమోదుచేయడం వంటి ప్రక్రియలు అన్నీ పూర్తయిన తర్వాత కూడా కొన్ని ఏళ్లపాటూ జగన్ మీది కేసులు నానుతూనే ఉన్నాయి. ప్రతిశుక్రవారం ఆయన కేసులు సీబీఐ కోర్టులో విచారణకు వస్తుండేవి. జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. అప్పట్లో పాదయాత్ర చేస్తున్నాను గనుక.. కోర్టుకు హాజరు మినహాయించాలని కోరినా న్యాయమూర్తి ఒప్పుకోలేదు. బెయిలు మీద బయట ఉంటూ రాజకీయం చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. బెయిలులోనే ముఖ్యమంత్రి అయ్యారు. బెయిలు మీద ఉన్న నిందితుడిగానే అయిదేళ్ల పదవీకాలాన్ని కూడా పూర్తిచేశారు. తీరా ఇప్పుడు ప్రజలు దారుణమైన పరాజయంతో ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత.. ఆయన మళ్లీ విచారణకు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి.
ఒకవైపు సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య హైకోర్టులో ప్రత్యేకంగా ఒక పిటిషన్ వేసి.. జగన్ మీద కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని కోరిన నేపథ్యంలో.. ఆయన మీద కేసుల అన్ని వివరాలు ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆదేశించడంంతో పాటు, రోజువారీగా విచారణ జరగాలని హైకోర్టు ఆదేశించింది. దీనివలన వారానికి ఒకసారి కోర్టుకు వస్తూ.. వాయిదాలు అడుగుతూ కాలయాపన చేసే వైఖరికి చెక్ పెట్టినట్టు అయింది. త్వరితగతిన విచారణ జరిగితే.. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెయిల్ త్వరలోనే రద్దయ్యే అవకాశం ఉన్నదని పలువురు అంటున్నారు.