జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ కావాలంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ అవకాశాన్ని ఎంత దారుణంగా వినియోగించుకున్నారంటే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లతో ఆయన పతనాన్ని శాసించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా ప్రవర్తించారో- అదే పదవిలో చంద్రబాబు నాయుడు ప్రవర్తన పనితీరు ఎలా ఉంటుందో జులై ఒకటో తేదీ నాడు రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలోనే చంద్రబాబు నాయుడు తన పరిపాలన ముద్ర ఏమిటో జగన్ వ్యవహార సరళితో తనకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు నిరూపించారు.
చంద్రబాబు నాయుడు పనితీరు ప్రజలకు తెలియని సంగతి ఏమీ కాదు. ఆయన 14 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. జులై 1న సంక్షేమ పెన్షన్ల లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్ అందించే విషయంలో చంద్రబాబు ముందు నుంచి చెబుతూనే వచ్చారు. ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని ఒకటో తేదీని 100 శాతం పూర్తి కావాలని, ఏవైనా కొన్ని మిస్ అయితే కనీసం 90 శాతం పూర్తి చేయాలని, ప్రభుత్వం ముందు నుంచి పురమాయిస్తూ వచ్చింది. జూలై ఒకటో తేదీన పెంచిన పెన్షన్ మొత్తాలను ఏకంగా 94 శాతానికి పైగా లబ్ధిదారులకు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2.6 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఒక రోజులో 88 శాతం మందికి పంపిణీ చేయడమే పెద్ద రికార్డు కాగా, చంద్రబాబు పాలనలో కేవలం 1.3 లక్షల సచివాలయ ఉద్యోగులను వాడుకొని అంతకంటే ఘనంగా పంపిణీ చేయించడం గమనార్హం.
మరో ముఖ్యమైన తేడాను కూడా ఇక్కడ గమనించాలి. చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకు పెనుమాకలో పెన్షన్లు పంచే కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమం తర్వాత ప్రజలతో కూర్చుని గ్రామసభ నిర్వహించారు. గత ఐదు ఏళ్లలో తెలుగు ప్రజలు ఎన్నడైనా ఇలాంటి అనుభవాన్ని చూశారా? జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అంటే తెల్లవారుజామున మొదలుకావడం ఎన్నడైనా జరిగిందా? బలవంతంగా తరలించిన డ్వాక్రా మహిళలతో భారీ సమావేశాలు తప్ప ప్రజలతో మమేకం అవుతూ నిర్వహించిన కార్యక్రమం ఉందా? ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ కార్యక్రమంలో ఒక గ్రామంలో పాల్గొనడం అంటే- ఉదయం నాలుగు గంటల కంటే ముందే లేచి సిద్ధం కావాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కర్తవ్యం నిర్వహణలో ఎంతటి అంకితభావంతో శ్రద్ధతో ఉంటారో ఈ పెన్షన్లు పంపిణీ ద్వారానే స్పష్టంగా నిరూపించుకున్నారు. అదే సమయంలో ఒక కార్యక్రమానికి హాజరైతే ఊరంతా దుకాణాలు మూయించి చెట్లను నరికేస్తూ, రోడ్ల పక్కన పరదాలు కడుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన జగన్మోహన్ రెడ్డి తీరును ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.