తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు నియమితులు కానున్నారు. సీనియారిటీకి, ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి, హుందాతనానికి పెద్దపీట వేస్తూ అశోక్ గజపతి రాజు చేతిలో టీటీడీ పాలన పగ్గాలు పెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి టీటీడీ బోర్డుతోనే చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కూటమి పార్టీల్లో కీలకంగా పనిచేసిన నాయకులకు కూడా బోర్డు సభ్యులుగా అవకాశం కల్పిస్తూ జీవో తేనున్నారు.
అశోక్ గజపతి రాజు తొలినుంచి తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు. హుందాతనంతో కూడిన రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి. సింహాచలం ఆలయానికి అనువంశిక ధర్మకర్త కూడా. రాజకీయంగా ఆయన అన్ని పదవులను అనుభవించారు. రాష్ట్రమంత్రిగానూ, కేంద్రమంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక అశోక్ గజపతిని కూడా పలురకాలుగా వేధించింది. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఆయనను తప్పించి, మరొకరిని నియమించింది. అశోక్ గజపతి కుటుంబ పరిరక్షణలోనే ఉన్న రామతీర్థం ఆలయంలో విగ్రహాల విషయంలో ఆయనను అవమానించారు. అశోక్ గజపతి కోర్టుకువెళ్లి సింహాచలం ఆలయం విషయంలో తమ హక్కులను తిరిగి తెచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో అశోక్ గజపతి పోటీచేయలేదు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పూర్తిగా రాజకీయాలనుంచి విరమించుకున్నట్టే. ఆధ్యాత్మిక చింతనతో కూడిన వ్యక్తిత్వం ఉన్న అశోక్ గజపతిని టీటీడీ బోర్డుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.