వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఒక చిత్రమైన ఎత్తుగడను ఆశ్రయించింది. దానివలన పని నెరవేరుతుందనే నమ్మకం లేకపోయినప్పటికీ, వారు ఆ ఉపాయాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కారు చవకగా లీజు పేరిట దక్కించుకుని పార్టీ ఆఫీసు పేరిట ప్యాలెస్ ల నిర్మాణాలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో కంగారుపడుతోంది.
ఈ కంగారులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి అర్థమవుతున్నట్లుగా లేదు. తాజాగా తమ పార్టీ కార్యాలయాలు కూల్చి వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్నదంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో విచారణలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో పాటించాలని అన్నారు.
హైకోర్టును ఆశ్రయించడం వలన కూల్చివేతలు ఆగుతాయని ఆ పార్టీ నాయకులకు ఎవరు సలహా చెప్పారో తెలియదు. వారు ఎలా నమ్మగలిగారో కూడా తెలియదు. కానీ ఈ కేసు ఎలా సాగుతుందో అంచనా వేయడం చాలా సులభం. విచారణకు వస్తే ఈ భవనాలు దేనికి కూడా ప్లాన్ అనుమతులు తీసుకోకుండా కట్టడం ప్రారంభించారని ప్రభుత్వ న్యాయవాది వాదిస్తారు.
విచ్చలవిడిగా కట్టేసిన భవనాల విషయంలో నిర్లిప్తంగా ఉండాలని.. వాటిని కూల్చకుండా వదిలేయాలని హైకోర్టు తీర్పు చెబితే రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కులకు, తప్పుడు పనులు చేసే వారికి భిన్నమైన సంకేతాలు వెళతాయి. ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేస్తే చాలు అనుమతి రాకుండానే తమకు ఇష్టం వచ్చిన రీతిగా కట్టేసుకోవచ్చునని మొండి ధైర్యం అందరికీ వస్తుంది. కాబట్టి హైకోర్టు అలాంటి తీర్పు ఇవ్వదు గాక ఇవ్వదు.
పైగా వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికీ వారికి ఇంకొక చిక్కు కూడా ఉంది. మొత్తం 26 జిల్లాలలో పార్టీ కార్యాలయాలు ప్లాన్ చేస్తూ ఉండగా వాటిలో దాదాపు 90 శాతానికి పైగా ప్రభుత్వ శాఖల నుంచి భూములను లీజుకు తీసుకునే ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.
చాలాచోట్ల లీజు ప్రక్రియ పూర్తికాలేదు. దాదాపుగా ఏ ఒక్క భవనానికి కూడా ప్లాన్ అప్రూవల్స్ లేవు. కొన్నింటిని 90 శాతానికి పైగా నిర్మాణం పూర్తి చేసేశారు. ఇలాంటి అరాచక పోకడలను హైకోర్టు అడ్డగోలుగా సమర్ధిస్తుందని వారు ఎలా అనుకుంటున్నారో తెలియదు. హైకోర్టు ద్వారా సాధించేది ఏమీ ఉండదని అన్ని జిల్లాలలోని వైసీపీ కార్యాలయ భవనాలు నేలమట్టం కావాల్సిందేనని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఇన్నాళ్లుగా తామే అధికారంలో ఉన్నప్పటికీ ప్లానులకు అప్రూవల్స్ తీసుకోవాలని కనీస జ్ఞానం లేకుండా పట్టించుకోకుండా అహంకారంతో విర్రవీగినందుకు ఆ పార్టీకి తగిన శాస్తి జరుగుతున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.