చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటిదాకా ప్రతిపక్షం మీద కూడా చాలా సౌమ్యంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికారుల మీద మాత్రమే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కూడా తమ వైపు నుంచి ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని చంద్రబాబు ఇదివరకే చెప్పారు.
పార్టీ వారందరితోనూ అదే విషయం సూచించారు. అలాగని తాము మొత్తం మెతగ్గానే ఉంటామని ప్రత్యర్థులు అనుకోకుండా కుప్పంనుంచి గట్టిగానే హెచ్చరికలు పంపారు. ‘కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు.. జాగ్రత్త’ అని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.
కుప్పం వేదికమీదినుంచి చెప్పి ఉండొచ్చు గానీ.. చంద్రబాబునాయుడు మాటలు కేవలం కుప్పంకు మాత్రమే పరిమితం అయినవి కాకపోవచ్చు. రాష్ట్రం మొత్తానికి కూడా ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే.. ఒక ముఖ్యమంత్రిగా కుప్పంలో మాత్రమే శాంతి భద్రతలను సక్రమంగా పరిరక్షించడం చంద్రబాబు బాధ్యత కాదు.
రాష్ట్రమంతా ఆయనదే అని వైసీపీ వారు తెలుసుకోవాలి. కక్ష సాధింపు ఉండదు అన్న మాటలు కూడా నిజమే. ఆ మాటల అర్థం.. నిన్నటిదాకా వారు చెలరేగి చేసిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకోవడం గురించి తమ పార్టీ, తమ ప్రభుత్వం ఆలోచించదు అని మాత్రమే. ఇప్పుడు తెదేపా ప్రభుత్వం నడుస్తుండగా.. సమాజంలో అశాంతిని, అభద్రతను కల్పించడానికి ప్రయత్నిస్తే, హింస రేకెత్తించడానికి కుట్రచేస్తే చంద్రబాబునాయుడు చేసిన ఈ తాజా హెచ్చరికలు వర్తిస్తాయి.
ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్లిన చంద్రబాబునాయుడు.. అక్కడినుంచి తనని ఎనిమిదిసార్లుగా గెలిపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల అని చెప్పుకున్నారు. కుప్పంలో కార్గో ఎయిర్ పోర్ట్ త్వరలోనే వస్తుందనే హామీ కూడా ఇచ్చారు.
నిజానికి దీనికి సంబంధించి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలోనే అడుగులు పడ్డాయి. తర్వాత పూర్తిగా అటక ఎక్కించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆ ఎయిర్ పోర్ట్ ప్రస్తావన తెచ్చారు. కుప్పం ప్రజలకు ఈ సందర్భంగా చంద్రబాబు అనేక వరాలు ప్రకటించారు.