థాంక్యూ బాబూ.. ఇంతకంటె శుభవార్త ఉంటుందా?

జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పి నిరుద్యోగులకు ఆశ పెట్టి మోసం చేశారో.. సరిగ్గా అదే విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయులు ఇవాళ చంద్రబాబు నాయుడును నెత్తిన పెట్టుకుంటున్నారు. ఫ్లెక్సీ లకు పాలాభిషేకాలు వంటి జగన్ అలవాటు చేసిన వేషాలు కనిపించడం లేదు గానీ, అంతకంటే ఎక్కువగా చంద్రబాబును వారు గుండెల్లో పెట్టుకుంటున్నారు.

ఎందుకంటే నిరుద్యోగ ఉపాధ్యాయుల కలలు ఫలించే లాగా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ మీద రెండో సంతకం చేసి, తాజాగా దానికి క్యాబినెట్ ఆమోదం కూడా పొందారు. డిసెంబరు 10వ తేదీలోగా కొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తిచేసి వారిని తగు మాత్రం శిక్షణకు పంపాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సోమవారం నాడు తీర్మానించింది.

అయితే నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఈ మెగాడిఎస్సి ని మించిన శుభవార్త మరొకటి ఉంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయడం ఒక నిరంతర ప్రక్రియ అని ఇకమీదట ప్రతి ఏడాది డీఎస్సీ అర్హత పరీక్షలు నిర్వహించి టీచర్లను నియమించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి ఉద్యోగు నియామకాలు చేపట్టడం అంటే నిరుద్యోగ ఉపాధ్యాయులకు అంతకుమించిన వరం మరొకటి ఉండదు అనుకోవచ్చు.

ఉపాధ్యాయ పోస్టులు ప్రతి ఏడాదీ గణనీయంగా ఖాళీ అవుతూనే ఉంటాయి. అయితే నియామకాలు మాత్రం ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో నిరుద్యోగ ఉపాధ్యాయులు కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారు. అలాకాకుండా ప్రతి ఆరునెలలకు ఓసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని, డీఎస్సీని నిరంతర ప్రక్రియగా ప్రతి ఏడాదీ నిర్వహించాలని చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించడం వారికి వరమే అని చెప్పాలి.

ఉపాధ్యాయ నియామకాల్లాగానే ఇతర ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా చంద్రబాబునాయుడు సర్కారు ఇదే స్థాయిలో చొరవ చూపితే బాగుంటుంది. ఉద్యోగాల కల్పనతో పాటు, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చి.. యువతకు విస్తృతంగా ప్రభుత్వ, ప్రెవేటు రంగాల్లోఉద్యోగాలు కల్పిస్తాననేది ఆయన ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. వాటిని నిలబెట్టుకునేదిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు ప్రతి ఏడాదీ డీఎస్సీ పడుతుందనే మాట కంటె పెద్ద శుభవార్త వేరే ఉండదని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories