రాష్ట్ర ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగోబ్లాకులో తన చాంబర్లో పూజలు నిర్వహించిన తర్వాత.. ఆయన వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవిలోకి వచ్చిన తర్వాత.. నారా లోకేష్ చేసిన తొలిసంతకమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వం గౌరవాన్ని పెంచేలా ఉంది. రాష్ట్రంలో టీచరు ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ సంబంధిత ఫైళ్ల మీదనే నారా లోకేష్ మంత్రిగా తన తొలి సంతకం చేశారు.
చంద్రబాబునాయుడు.. తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుమీదనే చేస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ 16347 పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలను క్యాబినెట్ ముందు పెట్టే ఫైలు మీదనే లోకేష్ తొలి సంతకం చేశారు. చంద్రబాబునాయుడు పాలన సామర్థ్యం మీద మాత్రమే కాదు, ఆయన మాటనిలబెట్టుకునే తత్వం మీద కూడా ప్రజల్లో గౌరవం పెరిగేలా లోకేష్ తొలిసంతకం ఉండడం విశేషం.
డీఎస్సీ విషయంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఒక రకంగా ప్రకటించి.. గెలిచిన తర్వాత పట్టించుకోలేదు. వారి ఆందోళనలను అణిచేశారు. తీరా 2024 ఎన్నికలకు ముందు ఆరువేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించి డ్రామా నడిపించారు. మెగాడీఎస్సీపై తొలిసంతకం అనే చంద్రబాబు హామీ ప్రచార సమయంలోనే జగన్ కు భయం పుట్టించింది. కానీ.. దానికి ప్రతిగా నిరుద్యోగ టీచర్లకు నమ్మకం కలిగించే మాట ఏదీ చెప్పకపోగా.. చంద్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మరు.. అంటూ రాష్ట్రాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోరు.. అనే అబద్ధపు ప్రచారం తప్ప.. తనకు మరో ఎజెండా లేదన్నట్టుగా ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. ప్రజలను వంచించే ఆ కుటిల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చంద్రబాబు అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. మెగా డీఎస్సీ ఫైలు మీద తొలిసంతకం చేశారు. ఇప్పుడు నారా లోకేష్ తొలిసంతకం కూడా జత కలిసి.. ఆ హామీలు… స్పష్టంగా కార్యరూపంలోకి రాబోతున్నాయని ప్రజలు హర్షిస్తున్నారు.