జగన్ గెంటేసిన నేతను అందలమెక్కించిన చంద్రబాబు!

ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి.. తాను మళ్లీ విజయం సాధించడంలేదు అనే సంగతి చాలా నెలల ముందుగానే అర్థమైంది. అయితే దక్కబోయే పరాజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకోవాలని అనుకోలేదు. సిటింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నదని, కుల సమీకరణాలను ఆధారం చేసుకుని ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే చాలు.. తన పార్టీ ఘన విజయం సాధించేస్తుందని ఊహలతో ఆత్మవంచన చేసుకున్నారు. అడ్డగోలుగా అభ్యర్థులను బదిలీలు చేశారు. ఈ క్రమంలో నరసరావు పేట ఎంపీగా ఎంతో బాగా పనిచేశారనే పేరు తెచ్చుకున్న లావు శ్రీకృష్ణ దేవరాయలును కూడా గుంటూరులో పోటీచేయించాలని అనుకున్నారు. నరసరావుపేట ఎంపీ పరిధిలోని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన నిర్ణయంపట్ల అభ్యంతరాలు వెలిబుచ్చినా పట్టించుకోకుండా లావును మార్చాలనుకున్నారు. దీంతో విసిగిపోయిన లావు క్రిష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరడం, ఘన విజయం సాధించడం జరిగింది.

ఆ విధంగా, తన సంకుచితమైన వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీనుంచి బయటకు గెంటేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబునాయుడు ఇవాళ అందలం ఎక్కించారు. ఆయనను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. ఉప నాయకులుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలను నియమించారు. కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని, లోక్ సభలో పార్టీ విప్ గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్ ను  నియమించారు.

జగన్ అంచనాలు ఎంత ఘోరంగా ఉంటాయో.. ప్రజల నాడిని పసిగట్టడంలో మాత్రమే కాదు. మరొకరి హితవాక్యాలను చెవిన వేసుకునే అలవాటులేని ఆయన తీరు పార్టీని ఎలా పతనం చేసేస్తుందో ఈ ఎన్నికలు నిరూపించాయి. జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థులు ఎవరైనా తన బొమ్మ తో గెలవాలని మాత్రమే అనుకుంటారు. అదే అహంకారంతో ఉంటారు. గెలిచినతర్వాత.. వారు ప్రజాప్రతినిధులుగా తమ సొంత పనితీరుతో ప్రజల మన్ననలు చూరగొని,  మంచి పేరు తెచ్చుకుంటే ఓర్వలేరు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకనే నరసరావుపేట ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్న లావు కృష్ణదేవరాయలును అక్కడినుంచి గుంటూరుకు మార్చాలని గట్టిగా పట్టుపట్టారని, లావు లేకపోతే తాము గెలవడం కూడా కష్టమని ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పిన సూచనలను కూడా ఖాతరు చేయలేదని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి లావుకు మాత్రం.. వైసీపీని వీడడం వల్ల మంచే జరిగింది. చంద్రబాబు ఆయనను అందలంపై కూర్చోబెట్టారని జనం అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories