రాబోయే ఐదేళ్లపాటు కేంద్రంలో అధికారం వెలగబెట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక భాగస్వామి! నరేంద్ర మోడీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో అత్యంత కీలకమైన నాయకుడు. ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఇవాళ ఉన్నది. పదవులు ఇతర వ్యవహారాలలో చంద్రబాబు నాయుడు ఏం కోరితే అది అసంబద్ధం కానంతవరకు ఆమోదించి తీరవలసిన పరిస్థితిలో కేంద్రం ఉంది. అయినా చంద్రబాబు అత్యాశకు వెళ్లడం లేదు. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఆఫర్లను కూడా చంద్రబాబు నాయుడు వద్దని అనుకుంటున్నారు. తనకు కావలసినదల్లా రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర పురోగతి మాత్రమే అని ఆయన స్పష్ఠీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్ళడానికి నిధుల పరంగా కేంద్రం నుంచి సాయం కావాలి తప్ప- ఇతరత్రా తమకు ఫేవర్ చేయవలసిన అవసరం లేదని ఆయన ఢిల్లీ పెద్దలకు తేల్చి చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు నాయుడు శనివారం నాడు అసెంబ్లీ ముగిసిన తర్వాత తెలుగుదేశానికి చెందిన ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలుగుదేశం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేశారు. పార్లమెంటులో తమ పార్టీ సభ్యులు వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు.
అయితే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలోనే కేంద్రం హోం మంత్రి అమిత్ షా నుంచి చంద్రబాబు నాయుడుకు ఫోను వచ్చింది. లోక్ సభలో స్పీకరు ఎన్నికపై ఢిల్లీ రాజకీయాల్లో హైడ్రామా జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశానికి ఆ పదవి కావాలేమో అభిప్రాయం తెలుసుకోవడానికి ఆయన ఫోను చేసినట్లు సమాచారం. అయితే తమకు స్పీకరు పదవి వద్దని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రం నుంచి తగిన సాయం కావాలని మాత్రమే చంద్రబాబు అభ్యర్థించారు. అమిత్ షాతో ఫోను సంభాషణ తర్వాత.. ఆయన స్వయంగా ఈ విషయాన్ని తన పార్టీ ఎంపీలకు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో తమ పార్టీ వారు పనిచేయాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు.
రాబోయే అయిదేళ్లపాటూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ అభివృద్ధి వైపు తీసుకువెళ్లడంతో పాటూ, స్వయం సమృద్ధంగా తయారుచేయడం లక్ష్యంగా బాబు పనిచేయనున్నారని అర్థమవుతోంది.