ఓటమిని స్వీకరించగల ధైర్యం లేని పిరికివాడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి’ అని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభలో మొదటిరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసేసి రెండో రోజే సభకు రాకుండా గైర్హాజరు అయిన వైసీపీ నాయకుల గురించి.. పవన్ కల్యాణ్ ఇలా కామెంట్ చేశారు. విజయాన్ని ఆస్వాదించారే తప్ప.. ఓటమిని స్వీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిలోని పిరికితనాన్ని శాసనసభాముఖంగా పవన్ కల్యాణ్ ఎద్దేవా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
నిజం చెప్పాలంటే.. ఓటమిని స్వీకరించలేని జగన్ పిరికితనం గురించి చెప్పగల హక్కు పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా పోటీచేయించి.. కేవలం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యేస్థానంలో మాత్రమే గెలుపొందారు. పవన్ తాను స్వయంగా పోటీచేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఆయన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలవగా, ఆయనను కూడా ప్రలోభపెట్టి వైసీపీ తమలో కలిపేసుకుంది. జనసేన పార్టీకి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేసేసింది.
అయితే ఈ ఓటమిని పవన్ కల్యాణ్ చాలా హుందాగా స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ లాగా.. ప్రజల నమ్మకం మన వెంటనే ఉంది. ఈవీఎంలలో ఏదో జరిగింది.. ఆ మోసం వల్లే మనం ఓడిపోయాం అని మాయమాటలు చెబుతూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించలేదు. ఓటమిని హుందాగా స్వీకరించడం అంటే ఏమిటో పవన్ కల్యాణ్ చూపించారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యల మీద పోరాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పరిపాలన మీద అలుపెరగని పోరాటం సాగించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలురైతులకు తమ పార్టీ తరఫున సొంత డబ్బులను ఆర్థిక సాయంగా అందించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఉద్యమించి.. తమ పార్టీ సొంత డబ్బులతో రోడ్లకు రిపేర్లు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రజల పక్షాన ఉండడం తన బాధ్యతగా భావించారు. అందుకే.. అయిదేళ్లు గడిచేసరికి.. చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని.. 21 స్థానాల్లో తమ పార్టీని పోటీకి దింపితే.. నూరుశాతం విజయాలు సాధించి రికార్డు సృష్టించారు పవన్ కల్యాణ్. ప్రజల పక్షాన పనిచేసిన తన స్ఫూర్తికి ప్రజలు ఇచ్చిన గౌరవంగా అది దక్కించుకున్నారు.
కానీ జగన్ పరిస్థితి వేరు. ప్రజలు ఓడించిన నాటినుంచి.. ఆయన ప్రజల తీర్పును అగౌరవపరుస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో మోసం జరిగిందనే వ్యాఖ్యల మీదనే ఉన్నారు. తాను డబ్బు పంచిపెట్టిన వారి అభిమానం తనతోనే ఉందని, వారు మోసపోయారని మాయమాటలు చెబుతున్నారు. కనీసం ప్రజలు గెలిపించినందుకు శాసనసభకు కూడా హాజరు కాకుండా పలాయనం చిత్తగించారు.. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు జగన్ పిరికితనం గురించి ఎద్దేవా చేయగల హక్కు ఉన్నదనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.