చంద్రబాబును ఆకాశానికెత్తేసిన రేవంత్ రెడ్డి !

రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ సారథి కూడా. కానీ.. ఆయన ఈ పదవికి ముందు రాజకీయంగా వైభవదశను చేరుకున్నది మాత్రం తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబునాయుడు సారథ్యంలోనే. అందుకే చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డికి అపరిమితమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. తాను కాంగ్రెసు పార్టీలో ఉన్నాడు గనుక.. చంద్రబాబు మీద భక్తిని దాచుకోవడానికి కూడా ఆయన వెనుకాడే రకం కాదు. అందుకే హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఆయన చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ కొనియాడారు.
హైదరాబాదులో బసవతారకం కాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు పనితీరును కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని ప్రస్తావించారు. ఆయనతో పోటీ పడి పొరుగురాష్ట్రం సీఎంగా పనిచేయాలని ఉందనే ఆకాంక్షను కూడా వెలిబుచ్చారు.

రేవంత్ మాటల్లోనే చెప్పాలంటే..
‘‘మనలో ఉన్న ఆటలోని నైపుణ్యం సరిగ్గా బయటకు రావాలంటే.. బాగా నైపుణ్యం ఉన్న ఆటగాడితోనే పోటీ పడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు పక్కరాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత.. అభివృద్ధిలో , సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను రోజుకు 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే.. నేను 12 గంటలు చేయడం సరిపోదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు చెబుతున్నా.. మనం కూడా 18 గంటలు పనిచేయాల్సిందే. అభివృద్ధిలో సంక్షేమంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే రోల్ మోడల్ గా నిలవాలని నేను భావిస్తున్నాను. ఆ దిశగానే మా ఆలోచన ఉంటుంది’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

నిజానికి రేవంత్ చంద్రబాబును ఇంతగా పొగడాల్సిన అవసరం లేదు. కానీ.. బాగా నైపుణ్యం ఉన్న ఆటగాడిగా ఆయన చంద్రబాబును కీర్తిస్తూ.. ఆయనతో పోటీపడడం వలన తాను కూడా రాణిస్తానన్నట్టుగా చెప్పడం ఇప్పుడు తెలుగుదేశం వారికి ఆనందం కలిగిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories