జగన్మోహన్ రెడ్డి పిచ్చి తలకెక్కిన వాళ్లకు ఇంకా సిగ్గు వచ్చినట్లుగా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘోరమైన తిరస్కారంతో జగన్ ను ఓడించినప్పటికీ, వారి కళ్లు తెరచుకున్నట్టు లేదు. జగన్ కనిపించిన వెంటనే ‘సీఎం సీఎం’ అంటూ పిచ్చి నినాదాలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాకు కూడా గతి లేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలినప్పటికీ ‘ సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తే ప్రజలు నవరంద్రాలతో నవ్వుతారనే భయం కూడా వారికి కలిగినట్లు లేదు. అన్నింటికంటె పరాకాష్ట ఏంటంటే.. సాధారణ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కూడా.. తనను చూసి అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తోంటే.. చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నారు.
ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. శాసనసభ సమావేశాలకు మొదటిరోజు వెళ్లి జస్ట ప్రమాణ స్వీకారం చేసి, సభలో కూర్చోకుండానే ఇంటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభకు వెళ్లే సీడ్ యాక్సిస్ దారి కాకుండా మరో మార్గంలో అసెంబ్లీకి చేరుకోవడం, వెనుకదారి గుండా సభలోకి వెళ్లడం, ప్రమాణం సమయానికి లోపలకు వెళ్లడం, ప్రమాణం తర్వాత కూర్చోకుండానే ఇంటికెళ్లిపోవడం ఇవన్నీ కూడా జగన్ లోని సిగ్గుపడే ధోరణికి నిదర్శనాలుగా నిలిచాయి.
అయితే కొత్త సభాపతి తన స్థానాన్ని స్వీకరిస్తున్న వేళ సాంప్రదాయం ప్రకారం.. పార్టీ నాయకుడిగా తాను వెంట ఉండాలనే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి.. తమ పార్టీ వారందరినీ గైర్హాజరు చేసి.. పులివెందులకు వెళ్లారు జగన్. అయిదు రోజుల పాటు అక్కడే ఉండి, తన మెజారిటీ ఎందుకు తగ్గిందో సమీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్పుడు.. అక్కడికి గుంపులుగా తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున ‘‘సీఎం సీఎం’’ అంటూ నినాదాలు చేశారు. పాపం.. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కకపోగా, ఏదో పోనీపాపం అని జాలితో చంద్రబాబు నాయుడు దయతలచి మంత్రులత తర్వాత ప్రోటోకాల్ లో ప్రమాణ స్వీకారం ఏర్పాటుచేయిస్తే.. అది చదివేసి వెళ్లిపోయారు జగన్. అలాంటి మామూలు ఎమ్మెల్యేను చూసి.. ఎంత అభిమానులైనా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం.. చూస్తున్న వారికరి మాత్రం చాలా కామెడీగా అనిపించింది. ఇలాంటి మాయ అభిమానుల వల్లనే జగన్ పతనం అయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.