కమలతీర్థం కోసం వైసీపీ ఎంపీల తహతహ!

లోక్ సభలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాళీ కాబోతోందా? ఆ పార్టీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలలో ముగ్గురు- భారతీయ జనతా పార్టీలో చేరడానికి తహతహలాడుతున్నారా? ‘రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు’ అని ఎన్నికలు తేటతెల్లంగా నిరూపించిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు రోజులు ముంచుకురానున్నాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం నాడు అమరావతి అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలతో రాయబారాలు సాగిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. మిథున్ రెడ్డి తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా వైసీపీకి రాజీనామా చేసి బిజెపిలోకి రావాల్సిందిగా కోరుతున్నారని కూడా అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అంగీకరిస్తే గనుక కడప ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి మినహా ఆ పార్టీ ఎంపీలు ముగ్గురూ బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పడం విశేషం! అయితే తమ పార్టీ వారిని చేర్చుకునే ఉద్దేశంతో లేదని ఆయన అంటున్నారు!

చెల్లెలు షర్మిల కారణంగానే రాష్ట్రంలో ఓడిపోయానని తెలుసుకున్న జగన్ ఆమెతో రాజీ కుదిరించడానికి తల్లిని సంప్రదించారని ఆదినారాయణ రెడ్డి మరో విషయం కూడా బయటపెట్టారు. అయితే తల్లి ద్వారా జరిగిన సంప్రదింపులలో షర్మిల అంగీకరించలేదని అన్నారు. జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా షర్మిల సూచించారని కూడా ఆయన చెబుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బిజెపి వైపు చూస్తున్నారని వాదన చర్చనీయాంశంగా మారుతోంది.

రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదనేది వారికి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడేదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచాం అని, జాగ్రత్తపడకపోతే కష్టమని వారు అనుకుంటున్నారట. అందుకే మిధున్ రెడ్డి బిజెపితో సంప్రదింపులు జరిపారనే మాటలను ప్రజలు నమ్ముతున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పార్టీ బలంతో కాకుండా సొంత బలంతో గెలిచిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఆ పార్టీ భవిష్యత్తు ఏమౌతుందో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories