భారత దేశరాజకీయాల్లోనే తన పేరుకే ఒక బ్రాండ్ వేల్యూ ఉన్న రాజనీతిజ్ఞుడు నారా చంద్రబాబునాయుడు తన శపథం నెరవేర్చుకున్నారు. ఆయన నాయకత్వానికి, సమర్థతకు, కార్యకుశలతకు తెలుగుజాతి నీరాజనాలు పట్టగా.. చంద్రబాబునాయుడు.. నాలుగోసారి ముఖ్యమంత్రి అయి శాసనసభలో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కౌరవసభ గా పతనం అయిపోయిన శాసనసభలో కన్నీళ్లు పెట్టుకుని.. మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలో తిరిగి అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబునాయుడు దానిని నెరవేర్చుకున్నారు. కౌరవ సభను గౌరవసభగా మార్చిన తర్వాత మాత్రమే.. ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయన తిరిగి సభలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకు పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చాంబర్ లో ఆసీనులైన చంద్రబాబును వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
అంతకుముందు, అసెంబ్లీ ఆవరణలో చంద్రబాబునాయుడు కారు దిగినప్పటినుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, అభిమానులు అందరూ.. గౌరవ సభకు స్వాగతం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడు.. అసెంబ్లీ మెట్లకు వంగి ప్రణమిల్లి.. నమస్కరించుకుని.. కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబునాయుడు.. 2021 నవంబరు 19న శాసనసభను కౌరవసభగా అభివర్ణించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడిన లేకి మాటలు, వాటిని వింటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరకమైన ఆనందంతో స్పందించిన తీరు ఆయనను ఎంతో బాధపెట్టాయి. సభలోనే కంటతడిపెట్టుకున్న చంద్రబాబునాయుడు.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలో అడుగుపెడతానని, కౌరవసభను గౌరవ సభగా మార్చి అడుగుపెడతానని శపథం చేశారు. ఇప్పుడు దానిని నెరవేర్చుకుని సభకు వచ్చి సభానాయకుడుగా తొలి ప్రమాణం చేయడంతో.. తెలుగుదేశం వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.