చంద్రబాబు నాయుడుకు దగ్గర వ్యక్తి, ఆయన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి అనేవి తప్ప ఆ అధికారి చేసిన పాపాలు వేరే ఏమీ లేవు. కేవలం ఆ కారణాల మీద, ఆయన మీద తీవ్ర స్థాయిలో పగబట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన వేధింపులకు గురిచేసింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా సేవలందించిన ఏబీ వెంకటేశ్వరరావును జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. చట్టవిరుద్ధంగా- ఒకటే కారణం మీద రెండు సార్లు సస్పెండ్ చేయడం కూడా ఆయన విషయంలో జరిగింది. చిట్టచివరకు జగన్ పగబట్టిన వైఖరిని న్యాయస్థానాలు ఆక్షేపించిన తర్వాత, గతిలేని పరిస్థితిలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఒక విలువ లేని పోస్టును ఆయనకు ఇచ్చి సాగనంపారు. ఏబీవీ విషయంలో జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తం అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దానికి తగిన రీతిలో జవాబు చెప్పారు.
గురువారం రాత్రి ఐపీఎస్ ల బదిలీలు చోటు చేసుకున్నాయి అందులో కీలకమైన బదిలీ ఏంటంటే- ఎన్నికల ముందు, కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే వరకు డీజీపీగా కొనసాగిన కసిరెడ్డి రాజేంద్రనాధరెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బదిలీ చేయడం! అలాగే తెలుగుదేశానికి చెందిన వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేశారని అభియోగాలు ఉన్న సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను జిఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించారు.
ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అనుచితంగా వ్యవహరించింది. చంద్రబాబు నాయుడుకి దగ్గరైన అధికారి అనే ఉక్రోషంతో- పరికరాలను కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎలాంటి ఆధారాలు లేని కేసును బనాయించి ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ చేశారే తప్ప దర్యాప్తులో ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పదవిని ఇచ్చిన జగన్ సర్కారు, రోజుల వ్యవధిలోనే అవే కారణాల మీద మళ్ళీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన మళ్ళీ ట్రిబ్యునల్ కి వెళ్లి తిరిగి తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఉత్తర్వులు తెచ్చుకొని రోజులు వారాలు గడిచినా పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు ని వేధించింది. ఒకవైపు మే నెలాఖరుకు ఆయన రిటైర్మెంట్ ఉన్న నేపథ్యంలో పోస్టింగ్ అనేది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ మళ్ళీ హైకోర్టుకు వెళ్లి చివరి నిమిషంలో అక్కడి నుంచి తనుకు అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్న తర్వాత, సర్వీసునుంచి రిటైర్మెంట్ కావడానికి చిట్టచివరి రోజున ఆయనను మళ్ళీ అదే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టులో కూర్చోబెట్టింది జగన్ ప్రభుత్వం. ఆ రకంగా అవమానించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడు, జగన్ జిల్లాకి చెందిన వాడు, జగన్ కులానికే చెందినవాడు అయిన మాజీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని సేమ్ టు సేమ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టులోకి పంపడం గమనించాల్సిన సంగతి!