ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు మళ్లీ తెలుగుదేశంలో చేరబోతున్నారా? ఈ మేరకు ఆయన చంద్రబాబునాయుడుతో మంతనాలు కూడా పూర్తిచేసుకున్నారా? బేషరతుగానే రాబోయే ఎన్నికల్లో ఫలానా సీటు నుంచి టికెట్ కావాలనే కండిషన్లు ఏం లేకుండానే.. శిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. 2019 తర్వాత తెలుగుదేశాన్ని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. 2024 ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా దూరంగా ఉండిపోయిన శిద్ధా రాఘవరావు, ఆ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎట్టకేలకు తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
శిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు. ఆయన గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశాన్ని వీడిపోయారు. వైసీపీలో చేరారు. ఆర్థికంగా బలమైన నాయకుడు అయిన శిద్ధాను, ఆయన వ్యాపారాల పరంగా ఇరుకున పెడతారనే బెదిరింపులు రావడంతోనే ఆయన వైసీపీలో చేరినట్టుగా అప్పట్లో పలు పుకార్లు వినిపించాయి. ఆ పార్టీలో చేరారే తప్ప.. ఆయనకేం పెద్దగా ఆదరణ దక్కలేదు.
2024 ఎన్నికల నాటికి తనకు బాగా బలమున్న దర్శినుంచి ఆయన పోటీచేయాలని అనుకున్నారు. అయితే ఆ సీటును బూచేపల్లి కుటుంబానికి ఇవ్వాలని ముందే ఫిక్స్ అయిన జగన్మోహన్ రెడ్డి.. శిద్ధాకు అద్దంకి, ఒంగోలు, మార్కాపురం లలో ఏదైనా ఇస్తానని ఆఫర్ పెట్టారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఎన్నికల వ్యవహారానికి పూర్తి దూరంగా ఉండిపోయారు. తీరా ఫలితాలు తెలిసిందే. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన లేఖను జగన్ కు పంపారు.
అయితే ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాతే.. రాజీనామా చేశారని అనుకుంటున్నారు.