జంపింగ్ లేదా రాజీనామాలకు ఎమ్మెల్సీలు రెడీ!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ నమోదు కానంత ఘోరమైన పరాజయాన్ని, ప్రజల తిరస్కారాన్ని మూటగట్టుకుంది. 151 సీట్లతో 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం కట్టబెడితే.. వారి నమ్మకాన్ని జగన్ దారుణంగా వమ్ము చేశారు. ఐదేళ్లు గడిచేసరికి ఆ పార్టీ బలం కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కొన్ని కులాలను నమ్ముకుని రాజకీయం చేస్తుంటారు గనుక ఆమాత్రం 39 శాతం ఓటు బ్యాంకు అయినా వారికి మిగిలింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అంతరించిపోయినట్లేనని ఆ పార్టీలో కొనసాగడం అనేది ఆత్మహత్యా సదృశ్యం అని అనేక మంది నాయకులు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలలో ఏదో ఒక పార్టీని ఎంచుకొని వారి ఆశ్రయం పొందడం తప్ప- వైసీపీని వదలాలని అనుకుంటున్నా వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్నవారు అనేకులు తమ పదవులకు రాజీనామా చేయడానికి లేదా అధికార కూటమిలో చేరడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

శాసన మండలిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఈ మెజారిటీని అధిగమించి ఎన్డీఏ కూటమి తమ బలం సాధించడానికి చాలా కాలం పడుతుంది. అప్పటిదాకా సభలలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శాసనమండలిలో వైసీపీ సభ్యులు తిరస్కరించే ప్రమాదం కూడా ఉంది. అయితే సహజ క్రమంలో ఎన్నికలు రావడానికంటే ముందే మండలిలో కూడా ఆధిపత్యం చేపట్టాలని కూటమినేతలు యోచిస్తున్నారు. దీనికి తగినట్లుగా వైసిపి ఎమ్మెల్సీలు పలువురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, తిరిగి తమకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపాలని కూటమి పార్టీ నేతలతో రాయబారాలు నడుపుతున్నారు. వేటు ప్రమాదం లేకుండా చూస్తే రాజీనామా తో సంబంధం లేకుండా ఫిరాయించి కూటమి పార్టీలతో చేరిపోవడానికి కూడా వారు సిద్ధంగానే ఉన్నారు.

ఎమ్మెల్సీలు కూటమివైపు చేరితే గనుక జగన్మోహన్ రెడ్డికి ఆది ఇంకా పెద్ద షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. శాసనసభలో మేము చేయడానికి ఏమీ లేదు.. శాసనమండలిలోనే మీరు ప్రభుత్వంపై పోరాడుతూ ఉండాలి.. అని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేసి రెండు రోజులు కూడా గడవలేదు. అప్పుడే వారు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ షాక్ ను జగన్ ఎలా తట్టుకుంటారో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories