హోదా మాట ఎత్తే అర్హత నీకు లేదు జగన్ !

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి మాట్లాడడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 22 మంది లోక్‌సభలు ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలతో కేంద్రంలో ఏ కూటమిలోనూ లేని ఎంతో బలమైన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ గత అయిదేళ్లపాటూ ఉన్నది. ఈ అయిదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం ఏం చేశారు? ఎన్ని సార్లు ప్రశ్నించారు? ఎన్నిసార్లు ఉద్యమించారు? ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ, కనిపించినప్పుడెల్లా మోడీ కాళ్లు మొక్కుతూ.. జగన్మోహన్ రెడ్డి సాధించినది ఏమిటి? తన మీద, తన తమ్ముడి మీద ఉన్న కేసుల్లో సీబీఐ ముందడుగు వేయకుండా చర్యలు తీసుకోకుండా తమను తాము కాపాడుకోవడానికి పార్లమెంటులో ఉన్న బలాన్ని పణంగా పెట్టి.. ఢిల్లీ పెద్దలతో ఆయన సత్సంబంధాలు పాటించారే తప్ప.. ప్రత్యేకహోదా గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? ప్రత్యేకహోదా అనే మాటనే రాష్ట్రప్రజలు మరచిపోయేలా, ఆ స్ఫూర్తిని కూకటివేళ్లతో సహా పెకలించి చంపేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలు తన మొహానే నవ్వుతారనే వెరపు, భయం కూడా లేకుండా.. చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా సాధించుకురావాలని, అలా సాధించకపోతే ఆయనను రాష్ట్రంలోని యువతరం ఏమాత్రం క్షమించరని అనడం చాలా కామెడీగా ఉంది.

రాష్ట్రంలో యువతరం ఎందుకు క్షమిస్తారో.. ఎందుకు క్షమించరో ఈ ఎన్నికల్లోనే తేలిపోయింది. కేవలం సంక్షేమ పథకాల ముసుగులో డబ్బులు పంచిపెట్టి.. గెలిచిపోతాం అనుకునే దుర్మార్గపు వ్యూహాలకు జనం మూకుమ్మడిగా చెక్ పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలయ్యారు. డబ్బులు పంచడం తప్ప.. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ ఉద్యోగాలు తప్ప.. యువతకోసం ఉద్యోగాల అవకాశమే లేకుండా సాగించిన అసహ్యకరమైన పాలనను ప్రజలు తిప్పికొట్టారు. జగన్ ప్రభుత్వం హోదా విషయంలో ఆడిన నాటకాలకు.. కేంద్రం దాన్ని ఏనాడో పక్కన పెట్టేసింది. ఇప్పుడు హోదా లేకపోయినా సరే.. ఆ స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే చంద్రబాబు ముందున్న బాధ్యత. అందుకు ఆయన వద్ద ప్రణాళికలు ఉన్నాయి. పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం, అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగితే చాలు.. ప్రజలు హోదా అనే రాజకీయ  మాయమాటలను పట్టించుకోరు. ఆ సంగతి జగన్ తెలుసుకోవాలి. హోదా డిమాండును తాను చంపేసి.. ఇప్పుడు చంద్రబాబుకు ముడిపెట్టి లబ్ధి  పొందాలనుకునే కుత్సితపు ఆలోచనలు మానుకోవాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories