‘ఎటికెట్’ అనే పదం గురించి జగన్‌కు తెలుసా?

ఇంగ్లీషు భాషలో ‘ఎటికెట్’ అనే పదం ఒకటి ఉంటుంది. నిఘంటువు చూసినట్టయితే.. మర్యాదక్రమం, ఆచారం, శిష్టాచారం, మర్యాద అనే రకరకాల అర్థాలు మనకు కనిపిస్తాయి. ఈ పదాలు కాస్త గంభీరంగా కనిపిస్తే గనుక.. మనం సింపుల్ గా సంస్కారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంగ్లిషు భాషలో అలాంటి పదం ఒకటి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసా? అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా జగన్ తో మాట్లాడడానికి ఫోను చేస్తే, ఆయన అసలు అందుబాటులోకి రాలేదని వార్తలు వస్తున్నాయి.

తాను మారిపోయిన చంద్రబాబును అని చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాల తర్వాత తన పార్టీ నేతల సమావేశంలో ప్రకటించారు. మారడం అనేది అన్ని కోణాల్లోనూ అన్నట్టుగా తన ప్రవర్తనను కూడా మార్చుకున్నారేమో అనిపిస్తోంది. మాటల్లో హుందాతనం మరింతగా పెరిగింది. పైగా ప్రత్యర్థులను కూడా కలుపుకుపోవడానికి ఒక మెట్టు దిగినా మంచిదే అనే ధోరణిని అవలంబిస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఎలాగంటే..

కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేని ఒక మామూలు ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి ఫోను చేసి, తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించే అధికారి ఎవరో ఒకరు ఆహ్వానిస్తే సరిపోతుంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారు. జగన్ కు తానే స్వయంగా ఫోను చేసి పిలవడానికి ప్రయత్నించారు.  

కానీ రాజకీయాల్లో కూడా ‘ఎటికెట్’ అంటూ ఒకటి ఉంటుందని తెలియని జగన్మోహన్ రెడ్డి, కనీసం చంద్రబాబు ఫోనుకు అందుబాటులోకి కూడా రాలేదు. అంటే ఆయన చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా కూడా మాట్లాడదలచుకోలేదు. కుప్పం మునిసిపాలిటీని అనేక దందాల తర్వాత గెలుచుకున్న సందర్భంలో.. ‘మీ నాయకుడిని రమ్మనండి.. ఓసారి మొహం చూడాలనుంది’ అంటూ లేకిగా వ్యాఖ్యానించిన జగన్మోహన్ రెడ్డి.. పాపం ఇప్పుడు తన మొహం నలుగురికీ చూపించడానికి ఇబ్బంది పడుతున్నారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా.. ఈ రకంగా మొహం దాచుకుని ఎన్నాళ్లు తిరగగలరని అంటున్నారు?

Related Posts

Comments

spot_img

Recent Stories