ప్రమాణ స్వీకారానికి జగన్ డుమ్మా!

గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న పెద్ద మైదానంలో బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరగబోతున్నది. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు, దేశంలో ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు కూడా పలువురు హాజరు కాబోతున్నారు.  అయితే ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గైర్హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లకూడదని ఆయన నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరు సాధారణ ఎమ్మెల్యేలకు వెళ్లినట్లుగానే.. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున గెలవడంతో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత అనే హోదా కూడా దక్కని సంగతి అందరికీ తెలిసిందే. ఆ హోదా దక్కి ఉంటే కనీసం కేబినెట్ మంత్రి స్థాయి ప్రోటోకాల్ ఉండేది. ఇప్పుడు ఆయన మాజీ  ముఖ్యమంత్రి అనాల్సిందే తప్ప, ఒక మామూలు ఎమ్మెల్యే మాత్రమే. తాను అధికారంలో ఉన్నప్పుడు.. తెలుగుదేశం నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక్కరు ఎమ్మెల్యేలు వలస వస్తే వారిని తన పంచన చేర్చుకోవడం మాత్రమే కాకుండా, తాము తలుపులు తెరిస్తే చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోతుందని అనేకమార్లు ఎద్దేవా చేసిన వ్యక్తి జగన్. అయిదేళ్లు ఆ అహంకారాన్ని అపరిమితంగా ప్రదర్శించిన తరువాత.. ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది. ప్రజలు- జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.

అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ మీడియా ముందు ఇండైరక్టుగా అనుమానాలను వ్యక్తం చేసిన జగన్‌లో ఇంకా ఓటమికి సంబంధించిన అసహనం తగ్గలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావాలని నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లవద్దని సూచించినట్టు సమాచారం. ఇలా ఆబ్సెంట్ కావడం సంకుచితంగా ఉంటుందని, అయినా తమ నాయకుడు చెప్పినా వినరని పార్టీ వారే అంటున్నారు. ‘అయ్యవారి కోసం అమావాస్య ఆగుతుందా..’ అనే సామెత చందంగా జగన్ రాకపోయినంత మాత్రాన ప్రమాణ స్వీకారం ఆగుతుందా? అని పలువురు నవ్వుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories