నీతో పాటు జైలుకు ఎవరెవరు వాసుదేవా?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్ టీఎస్ అధికారి భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. సోమవారం నాడే ఆయన అరెస్టు అయినట్టుగా పుకార్లు వచ్చాయి. సోమవారం అరెస్టు జరగలేదు గానీ.. ఆయన ఇళ్లపై  ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. రేపో మాపో ఆయన అరెస్టు తథ్యం అనే సంగతి ప్రబలంగా వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో వాసుదేవరెడ్డి అరెస్టు అనేది చాలా చిన్న సంగతి. ఆయన వెనుక ఉన్న పెద్దతలకాయలు, ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేయడానికి వీలుగా వ్యూహరచన చేసిన కీలక నాయకులు ఎవరు? వారిలో ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు? అనేదే కీలకంగా మారుతోంది.
వాసుదేవరెడ్డి తాడేపల్లి లోని కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి పత్రాలు, కంప్యూటర్ హార్డ డిస్కులు తదితరాలు హఠాత్తుగా తరలించుకుని వెళ్లిపోకుండా ఉంటే గనుక.. ఆయన ఇళ్ల మీద సీఐడీ సోదాలు చేయడం ఇంత త్వరగా మొదలయ్యేది కాదు. ఆయన అలా పత్రాలు ఎత్తుకు వెళ్లడంతో.. చోరీకింద ఆయనపై ఫిర్యాదులు అందాయి. దాంతో వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. కానీ నిజానికి వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి విచారణ సాగిస్తే.. వెలుగులోకి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత.. రాష్ట్రంలో ఉన్న అనేక బ్రూవరీలు, బెవరేజెస్ యజమానులను బెదిరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమ బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. వారికి నగదు ముట్టజెప్పి ‘కొనుక్కున్నారు.’ ఆ తర్వాతే అసలు దందా మొదలైంది. ఇప్పుడు అన్ని మద్యం తయారీ కంపెనీలు వైసీపీ వారే యజమానులుగా నడుస్తున్నాయి. అందరూ బినామీలే. కానీ ఆయా వ్యాపారాల ద్వారా అసలు కీలకంగా లబ్ధి పొందుతున్నది ఎవరు? బినామీల వెనుక ఉన్నది ఎవరు? లిక్కర్ దోపిడీ పర్వంలో అసలైన అంతిమలబ్ధి ఎవరికి అందుతోంది? ఈ సంగతులన్నీ కూడా తేలాల్సి ఉంది.

నిజానికి పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి తదితర కీలక నాయకులకు సంబంధించిన బినామీల పేర్లతో లిక్కర్ తయారీ కంపెనీలు చేతులు మారినట్టు అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతిమంగా లిక్కర్ వ్యాపారం ద్వారా అడ్డదారి ప్రయోజనం పొందుతున్న వారిలో ఫైనల్ గా జగన్ ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టు జరిగితే.. ఆయన ద్వారా తీగలాగితే.. ఏయే డొంకలు కదులుతాయో.. ఎవరెవరి బతుకులు జైలు పాలవుతాయో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories