తెలుగు ప్రజలకు అత్యంత విషాదకరమైన వార్త ఇది. తెలుగు పత్రికల జగత్తులో ఈనాడు ఒక సువర్ణ అధ్యాయంగా వెలుగొందేలా ఆ పత్రికను స్థాపించిన, నడిపిన మహనీయుడు రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో ఆయనను నానక్ రాం గూడలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ అమర్చారు. అక్కడ చికిత్స పొందుతూనే రామోజీరావు, శనివారం ఉదయం 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
రామోజీరావు వయస్సు 88 సంవత్సరాలు. 1936 నవంబరు 16వ తేదీన ఆయన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తొలుత మార్గదర్శి, ఇతర వ్యాపారాలను ప్రారంభించి తర్వాత ఈనాడు దినపత్రికను స్థాపించారు. ఈనాడు ఆవిర్భావంతో తెలుగు పత్రికల జగత్తు రూపురేఖలు మొత్తం మారిపోయాయి.
ప్రజల పక్షాన నిలిచి.. ప్రజలకోసం పనిచేయడం మాత్రమే కాదు.. ప్రభుత్వాల్ని పత్రికలు ప్రజలకోసం శాసించే స్థాయికి రామోజీరావు తన ఈనాడును తీసుకువెళ్లారు. ఆయనలోని పట్టుదల, కఠోరమైన పరిశ్రమ, నిర్ణయాత్మక శక్తి అనితర సాధ్యమైనవి.
ఈనాడులో జిల్లా పత్రికలు తీసుకురావడం అనేది దేశ పత్రికారంగంలోనే ఒక పెద్ద మార్పు. రామోజీరావు కేంద్రప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి అయిన రామోజీరావు మరణానికి telugumopo.com ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.