చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి. తెలుగుదేశం అనేది కేంద్రంలోని ఎన్డీయేలో రెండో అతిపెద్ద పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఒకవైపు మోడీ కష్టం వల్లనే ఎన్డీయే మూడోసారి మళ్లీ అధికారంలోకి రాగలిగిందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం.. చంద్రబాబునాయుడును కూడా ప్రధానిగానే గుర్తిస్తున్నది! అంటే దాని అర్థం.. ప్రధానితో సమానంగా ఆ కూటమి ప్రభుత్వాన్ని నడిపించే కీలకమైన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్.. నరేంద్రమోడీని ఎన్డీయే కూటమి నాయకులు లోక్ సభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్న తరువాత.. శకునాలు పలకడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వాన్ని నడపడం నరేంద్రమోడీకి సాధ్యం కాదని జైరాం రమేష్ అంటున్నారు.
543 సీట్లున్న లోక్ సభ ఎన్నికల్లో వంద సీట్లు కూడా గెలవలేకపోయిన అసమర్థ పార్టీ కాంగ్రెస్. అక్కడికే వారేదో అద్భుతాల్ని సృష్టించేసినట్టుగా.. రాహుల్ గాంధీ రెండు భారత్ యాత్ర లు చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైనదంటూ స్వామిభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. అదే సమయంలో.. ఒకవేళ ఆ కూటమిలోని కొన్ని పార్టీలు ఇంకొద్దిగా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి మ్యాజిక్ ఫిగర్ అందుకున్నారే అనుకుందాం. అలాంటి కూటమికి వంద సీట్లు గెలవలేకపోయిన కాంగ్రెస్ సారథ్యం వహించాలని, రాహుల్ ను ప్రధామంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలని ఉబలాటపడుతున్న ఈ స్వామిభక్త మేధావులు.. 293 సీట్లు గెలిచిన కూటమిని 240 సీట్ల భాగస్వామ్యం ఉన్న బిజెపి నాయకుడు నడిపించలేడని ఎలా అనగలుగుతున్నారో తెలియదు. మోడీ బలాన్ని ఎత్తిచూపగల నైతిక హక్కు తమకు ప్రజలు ఇవ్వలేదని వారు గుర్తించాలి.
జైరాం రమేష్ ఎన్డీయేను విమర్శించడంలో భాగంగా చంద్రబాబు ప్రాధాన్యాన్ని మాత్రం చక్కగానే గుర్తించారు. కేంద్రంలో ఇప్పుడు మోడీ మూడో వంతు ప్రధాని మాత్రమే అని అంటూ.. మిగిలిన ఇద్దరూ చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్ అని ఆయన అభివర్ణించారు. నరేంద్ర, నాయుడు, నితీశ్.. మూడు ‘న’లు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతాయని అంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం విస్పష్టంగా మోడీ ప్రాధాన్యాన్ని ఎన్డీయే సమావేశంలో ప్రస్తావించి.. తమ మద్దతు ప్రకటించారు. చంద్రబాబును కూడా కేంద్రంలో మోడీతో సమానమైన ప్రాధాన్యమున్న నాయకుడిగా కాంగ్రెస్ భావిస్తుండడం తెలుగుదేశం అభిమానులకు సంతోషాన్నే కలిగిస్తోంది.