జగన్ మాటల్లో కనిపిస్తున్న ‘జైలుభయం’!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా? ఈసారి జైలుకు వెళితే ఇప్పట్లో బయటకు వచ్చేది ఉండదని కూడా ఆందోళన చెందుతున్నారా? ఆయనలో ఈ జైలుభయం బాగా ఎర్లీగా స్టార్ట్ అయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినవస్తోంది. ఆయన ఇప్పుడు జైలు జీవితం గురించి ఆందోళన చెందుతున్నారు. అసలే ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురైంది. 151 సీట్లనుుంచి ఒక్కసారిగా 11 సీట్లకు గ్రాఫ్ పడిపోయింది. ప్రజలు తన పరిపాలనను దారుణంగా తిరస్కరించారు. ప్రజల మద్దతు లేదు. ఉద్ధండులు అనుకున్న పార్టీ నాయకులు అందరూ పరాజయం పాలయ్యారు. వారు ఎంత నిలకడగా తన వెన్నంటి ఉంటారో తెలియదు. ఇలాంటి భయాలు జగన్ ను వెన్నాడుతున్నాయి.

ఓడిపోయిన తర్వాత జగన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తన పాతరికార్డునే మళ్లీ వినిపించారు. అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు ఎన్నో వందల కోట్లు పంచిపెట్టాను. వారి ప్రేమ ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.. అంటూ వాపోయారు. దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ‘ఏదో జరిగింది.. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు’ అంటూ తనను ఓడించడానికి ఏదో కుట్రలు జరిగినట్టుగా ఆయన అనుమానాలను ఇండైరక్టుగా వ్యక్తం చేశారు. ‘ఏం జరిగినా సరే, ఎంత చేసినా సరే.. నా ఓటు బ్యాంకును 40 శాతానికంటె తగ్గించలేకపోయారు’ అని కూడా జగన్మోహన్ రెడ్డి బీభత్సమైన ధీమా కూడా వ్యక్తం చేశారు.

వీటన్నింటి మధ్యలో మేకపోతు గాంభీర్యం తెచ్చిపెట్టుకుని మరికొన్ని సంగతులు కూడా చెప్పారు. ప్రతిపక్షంలో ఉండడం నాకేమీ కొత్తకాదు అని అన్నారు. నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే ఉన్నానని కూడా చెప్పారు. ఈ అయిదేళ్లు తప్ప అని క్లెయిం చేసుకున్నారు. నా రాజకీయ జీవితంలో ఎవరూ పడనటువంటి ఇబ్బందులు కూడా పడ్డాను.. అని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అంతకంటె ఎక్కువ ఇబ్బంది పెట్టినా కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని జగన్ చెప్పుకున్నారు. అంటే.. నన్ను మళ్లీ జైలుకు పంపినా కూడా రెడీ అని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా సీబీఐ కేసులు పెండింగులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బెయిలు మీద మాత్రమే బయటఉండి ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి బాధ్యతలు చూశారు. ఆ కేసుల్లో తీర్పు వెలువడి శిక్ష పడితే పూర్తి స్థాయిలో జైలుకు వెళ్లాల్సిందే. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి హోదాలో, ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీ నాయకుడిగా.. ఢిల్లీలో మోడీని ఆశ్రయించి.. తన కేసుల విషయంలో శిక్ష పడకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయబలం దారుణం అయిపోయింది. మోడీ పట్టించుకుంటాడనే గ్యారంటీ లేదు. అదే సమయంలో.. తాను అధికారంలో ఉండగా.. చంద్రాబబునాయుడును అకారణంగా జైల్లో పెట్టించి వేధించిన వైనం ఆయననే వెన్నాడుతుంటుంది. చంద్రబాబునాయుడు కక్షసాధించదలచుకుంటే తనకు జైలుజీవితం తప్పదని ఆయన అనుకుని ఉండొచ్చు. అందుకే జైలు జీవితం గురించిన భయాన్ని ఇండైరక్టుగా వెలిబుచ్చారని ప్రజలు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories