బంపర్ మెజారిటీతో సింహాసనం మీదికి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 ఏళ్లపాటూ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నారా చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి ప్రజలు నీరాజనం పట్టారు. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి అత్యద్భుతమైన, అనూహ్యమైన మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతున్నది. తెలుగుప్రజలు పెట్టుకున్న కోటి ఆశలు, నమ్మకానికి నిదర్శనంగా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.

తెలుగుదేశం పార్టీ అపురూపమైన విజయాన్ని సాధించింది. చంద్రబాబునాయుడు నాయకత్వం పట్ల ప్రజలు తమ ఘనమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. కూటమి పార్టీలు మొత్తం అద్భుతమైన ఫలితాలను నమోదు చేశాయి. తెలుగుదేశం పార్టీ స్వయంగా 141 స్థానాల్లో పోటీచేసి 135 చోట్ల గెలుపు దిశగా దూసుకుపోతోంది. అదేసమయంలో 21 స్థానాల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన 20 స్థానాల్లో విజయం సాధించబోతోంది. పాలకొండ నియోజకవర్గం ఒక్కటీ పోటాపోటీగా సాగుతున్నది గానీ.. ఆ సీటు కూడా తమకే దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బిజెపి విషయానికి వస్తే 10 సీట్లలో పోటీచేసిన పార్టీ.. ఏకంగా 7 చోట్ల విజయం సాధిస్తున్నది. ఇవన్నీ అపురూపమైన విజయాల కింద లెక్క.

అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో మంత్రులందరూ అత్యంత దయనీయమైన స్థితిలో ఓటమి పాలవుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా ఎవ్వరూ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్న బొత్స సత్యనారాయణ కూడా ఏటికి ఎదురీదుతున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా బాగా పడిపోయింది. ఆయన స్వస్థలమైన కడప ఎమ్మెల్యే సీటును కూడా తెదేపా దక్కించుకుంది.

ఏ రకంగా చూసినప్పటికీ.. తెలుగుదేశం+ భాజపా+ జనసేన కూటమి అత్యద్భుతమైన విజయం నమోదు చేసింది. నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్రమోడీ ఫోనుచేసి అభినందించారు. కూటమి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories