4 కాదు 1 సాయంత్రం కోసం వెయిటింగ్!

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పోలింగు పూర్తయి 17 రోజులు గడచిపోయాయి. అందరూ టెన్షన్ టెన్షన్ గా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటికీ.. ఇవి చావో రేవో తేల్చే ఎన్నికలుగా తయారయ్యాయి. అందుకే నాయకులు కూడా అత్యంత ఉత్కంఠ మధ్య ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. బెట్టింగులు కాసే కాయ్ రాజా కాయ్ బాపతు వ్యక్తుల సంగతి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ కేటగిరీ వాళ్లంతా కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.

అయితే వీళ్లలో ఎవ్వరికీ కూడా.. జూన్ 4వ తేదీన సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎదురుచూసేంత ఓపిక లేదు. కాకపోతే అందరూ జూన్ 1 వ తేదీన సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసమే ఎదురుచూస్తున్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చివరి విడత ఎన్నికల పోలింగ్ జూన్ 1న ముగుస్తుంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. అంటే దేశభవిష్యత్తు పాలకులను తేల్చేసే ఎన్నికలన్నీ ముగిసిపోయినట్టే భావించాలి. ఆరు విడతల పోలింగుకు సంబంధించి కూడా.. పలు మీడియా, ప్రెవేటు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని, పోలింగ్ సరళిని పసిగట్టడం కూడా పూర్తిచేశాయి. అయితే చివరి విడత ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ బహిరంగంగా ప్రకటించకూడదనే నిబంధన ఉన్నందువల్ల ఆ సంస్థలన్నీ మిన్నకున్నాయి. జూన్ 1న సాయంత్రం 6 గంటలకు ఆ నిషేధాజ్ఞలు ముగుస్తాయి. అప్పటినుంచి దేశంలోని టీవీ చానెళ్లు మొత్తం హోరెత్తిపోనున్నాయి.

అందులోనూ కాస్త రెప్యుటేషన్ ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ప్రజలందరూ కూడా జూన్ 1 సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పోలింగు పూర్తయిన నాటినుంచి చాలా పెద్ద స్థాయిలో బెట్టింగులు నడుస్తున్నాయి. ఒకవైపు ప్రధానంగా తలపడిన వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్డీయే కూటమి పార్టీలు గెలుపు ధీమానే వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఏకంగా 151+ సీట్లు గెలుస్తున్నాం అని అతిశయంగా ప్రకటించుకోగా, 130కి పైగా స్థానాలతో గెలవబోతున్నాం అని తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నాయి. బెట్టింగులు అత్యధికంగా తెలుగుదేశానికి అనుకూలంగానే సాగుతున్నట్లు కూడా సమాచారం.

అయితే.. జూన్ 1న సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే.. బెట్టింగ్ మార్కెట్ కూడా అమాంతం జోరందుకుంటుందని, గేరు మారుతుందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories