పోస్టల్ బ్యాలెట్లు అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడుసుకుంటున్నది. గత ఎన్నికలకంటె ఈ దఫా పోస్టల్ బ్యాలెట్లు లక్షన్నరకు పైగా అదనంగా పోల్ కావడం కూడా.. వారిలో పెరుగుతున్న భయానికి ఒక కారణం. ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా తమకు వ్యతిరేకంగా పడతాయని వారు ముందునుంచి ప్రిపేర్డ్గ్‌గానే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే.. ఉద్యోగుల ఓట్లు చెల్లకుండాపోయేందుకు ముందునుంచి తమకు చేతనైన కుట్రలు అమలు చేస్తూ వచ్చారు. ఆ కుట్రలను ఆలస్యంగా గుర్తించిన ఉద్యోగులు, ఎన్నికల సంఘం నుంచి కొన్ని సడలింపులు కోరితే.. ఇప్పుడు తమ కుట్రలు ఫలించకపోయే సరికి ఎన్నికల సంఘం మీద పడి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏడుస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ అనేది ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ముప్పుగా మారబోతోంది. గత ఎన్నికల సమయంలో ఉద్యోగుల ఓట్లు జగన్ కు బాగా కలిసి వచ్చాయి. తాను అధికారంలోకి వస్తే వారంరోజుల్లోనే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, పీఆర్సీ వంటి ఇతర అనేక హామీలతో ఉద్యోగులను ఊరించారు. జగన్ ను నమ్మి ఉద్యోగులు ఎగబడి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఉద్యోగులను ఎన్ని రకాలుగా వేధించారో ముప్పుతిప్పలు పెట్టారో అందరికీ తెలుసు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ’పీఆర్సీ వద్దు మాకు పాత జీతాలే ఇవ్వండి’ అని ఉద్యోగులు మొరపెట్టుకునే పరిస్థితిని జగన్ కల్పించారు.
దానికి తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు ఉద్యోగులు ఎగబడి వేశారు. క్యూలైన్లలో నిల్చుని వేశారు. గత ఎన్నికల కంటె ఒకటిన్నర లక్ష ఓట్లు ఎక్కువ పడ్డాయి. అయితే.. పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే విషయంలో అటెస్టింగ్ అధికారులు కొన్ని చోట్ల సంతకాలు చేయకుండా, స్టాంపు వేయకుండా ఫారంలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు బ్యాలెట్లు వేసేసిన తర్వాత ఆ సంగతి గుర్తించి గొల్లుమన్నారు. తమ ఓట్లు చెల్లకుండా చేసేందుకు చాలా ప్రాంతాల్లో ఒక వ్యూహాత్మక కుట్ర జరిగిందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా.. పోస్టల్ బ్యాలెట్లకు కొన్ని సడలింపులు ఇచ్చారు. సంతకం ఉండి, స్టాంపు లేకపోయినా చెల్లుతాయని ప్రకటించారు. ఈ ఆదేశాలపై వైఎస్సార్ సీపీ ఏడుస్తోంది. ఇదంతా తెలుగుదేశం కుట్ర అని ఆరోపిస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా.. పోస్టల్ బ్యాలెట్లలో అన్యాయం జరగకుండా ఒక ఉత్తర్వులు ఇస్తే.. వాటి మీద పడి ఏడుస్తుండడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.